రెండు నెలలపాటు ప్రేక్షకులను ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉర్రూతలూగించిన ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అందరి ఫోకస్ డబ్ల్యూటీసీ ఫైనల్ మీదకు మరలింది. ఈ క్రమంలోనే టీమిండియా సారధి రోహిత్ శర్మ కూడా ఇంగ్లండ్ చేరుకున్నాడు. అక్కడ భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాడు.
ఐపీఎల్ కారణంగా టీమిండియా సభ్యులను విడతల వారీగా ఇంగ్లండ్ పంపిన సంగతి తెలిసిందే. లీగ్ దశ ముగిసిన వెంటనే ప్లేఆఫ్స్ చేరుకోని జట్లలో ఉన్న ఆటగాళ్లు అందరూ ఇంగ్లండ్ వెళ్లిపోయారు. వారిలో విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు రెండో క్వాలిఫైయర్ వరకు వెళ్లింది.

దీంతో అతను అప్పటి వరకు భారత్‌లోనే ఉన్నాడు. రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ చేతిలో ముంబై ఓడిపోయింది. దీంతో ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆదివారం నాడు రోహిత్ శర్మ సహా మరికొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్ బయలుదేరారు. వారిలో స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైన కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ చేరుకున్న రోహిత్ శర్మ.. టీమిండియా కొత్త ప్రాక్టీస్ జెర్సీలో కనిపించాడు. అతని ఫొటోలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'అరండల్ క్యాసిల్ క్రికెట్ క్లబ్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీమిండియాతో కలిశాడు' అని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫైనల్ కూడా ముగియడంతో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా త్వరలోనే ఇంగ్లండ్ బయలుదేరతాడని తెలుస్తోంది. అలాగే చెన్నై టీంలో ఉన్న అజింక్య రహానే కూడా ఇంగ్లండ్ వస్తాడు. వాళ్లు కూడా వచ్చిన తర్వాత వారం రోజులపాటు నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తారు. జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దీన్ని ఎలాగైనా గెలవాలని టీమిండయా కసిగా ఉంది.