
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ని గతవారం భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధిక వాయిదా వేయడంతో.. టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయిన భారత ఆటగాళ్లకు తాజాగా బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ప్లేయర్స్ ఇళ్లు వదిలి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటూ కసరత్తులు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వస్తువులతోనే దేహదారుఢ్యం సరిగ్గా ఉంచుకొనేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్.. ఢిల్లీలోని తన ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు.
కరోనా సెకండ్ వెవ్ కారణంగా బయట పరిస్థితులు బాగా లేకపోవడంతో రిషబ్ పంత్ ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాడు. జిమ్‌లు లేకపోవడం, క్రీడా మైదానాలు మూసేయడంలో ఇంటివద్దే కసరత్తులు చేస్తున్నాడు. ఇంటి వద్ద ఉన్న మైదానంలో గడ్డిని చదును చేసే మూవర్‌ను అటు ఇటూ తిప్పుతూ.. గ్రౌండ్‌ను చక్కదిగ్గాడు. మూవర్ సాయంతో మైదానం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీంతో అతడికి వ్యాయామం చేసినట్టు కూడా అయింది. ఇందుకు సంబందించిన వీడియోను పంత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దానికి మంచి కాప్షన్ ఇచ్చాడు.
'యే దిల్ మాంగే 'మూవర్'!. క్వారంటైన్‌కు విరామం ఇవ్వక తప్పలేదు. అయితే ఇండోర్‌లో చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించడం సంతోషకరం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి' అని రిషబ్ పంత్ వీడియోకు రాసుకొచ్చాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో పంత్ అత్యంత కీలకం కానున్నాడు. జట్టుకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా ఉంటున్నాడు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా దూకుడుగా బ్యాటింగ్ చేయగల అతడి సామర్థ్యం కోహ్లీసేనకు కొండంత బలం. గతంలోనూ అతడు ఇంగ్లండ్ సిరీసులో పరుగుల వరద పారించాడు.
ఐపీఎల్ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నాయకత్వం వహించిన రిషబ్ పంత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలిచింది. ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇప్పటినుంచే సన్నద్ధం అవుతున్నాడు. ఆసీస్‌తో సిరీస్ నుంచి భీకరమైన ఫామ్‌లో ఉన్న పంత్.. చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.