డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా టీంకు గట్టి షాక్ తగిలింది. ఆ టీం స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అంతకుముందు మడమ గాయంతో ఆటకు దూరమైన హాజిల్‌వుడ్.. భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గాయంతో కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా మిస్ అవుతున్నాడు.
ఈ ఏడాది హాజిల్‌వుడ్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. వరుస పెట్టి గాయాలు అతని కెరీర్‌కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా అతని మడమకు గాయమైంది. అది చాలా ఇబ్బంది పెట్టడంతో భారత పర్యటనకు కూడా రాలేదు. ఐపీఎల్‌లో కూడా కేవలం నాలుగు మ్యాచులే ఆడాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో జట్టును వీడాల్సి వచ్చింది. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడటం లేదు.

దీనిపై తాజాగా హాజిల్‌వుడ్ పెదవి విప్పాడు. తన సమస్య గురించి వెల్లడించాడు. 'నేను టెస్టు మ్యాచులు ఆడటం లేదు. కానీ ఏడాదిలో 50 వారాలు బౌలింగ్ చేస్తూనే ఉన్నా. ఇంగ్లండ్‌లో ఈ వారం రోజులు బౌలింగ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. బౌలింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. చక్కని డ్యూక్ బాల్‌తో ఆ మూవ్‌మెంట్ కూడా దొరికింది' అని చెప్పుకొచ్చాడు.
'ఇండియాలో, ఆస్ట్రేలియాలో ఇంకొక ప్రదేశంలోలా ప్రతి డెలివరీకి ఇక్కడ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది నాకు కొంచెం కలిసొస్తుందని అనుకున్నా. బ్రేక్ తర్వాత ఐపీఎల్ ఆడా. ఈ లీగ్‌లో ఇంటెన్సిటీ చాలా ఎక్కువ. అక్కడ అన్ని రకాల బాల్స్ వేయాల్సి ఉంటుంది. టెక్నికల్‌గా చూస్తే మన బాడీ కొన్నిసార్లు బ్యాడ్ షేప్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే నా సమస్య. బౌలింగ్ చేస్తుంటే సైడ్‌లో కొంచెం నొప్పి వచ్చింది. దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నాను అంతే' అని వెల్లడించాడు.
ఈ గాయం నుంచి కోలుకోవడానికి హాజిల్‌వుడ్ వద్ద రెండు వారాల సమయం ఉంది. ఈ రెండు వారాల్లో ఫిట్‌నెస్ సాధిస్తే ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌లో ఆడగలడు. 'నేను మరీ ఎక్కువ దూరం ఆలోచించను. మరో నాలుగేళ్లలో ఎక్కడుంటావ్? అని ఆలోచిస్తూ ఉండిపోతే ఇబ్బందే. అప్పటికి ఆడుతుంటానో లేదో కూడా తెలీదు. ఫాస్ట్ బౌలర్లు చాలా వరకు కావాలని ఆటకు దూరం అవ్వరు. గాయాల వల్లనో శరీరం తట్టుకోలేకనో ఆటకు దూరం అవుతారు. దానికి వయసుతో సంబంధం లేదు' అని హాజిల్‌వుడ్ పేర్కొన్నాడు.