
ముంబై: ఇంకొద్ది రోజులు.. టెస్ట్ క్రికెట్ చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయే ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. వచ్చేనెల 18వ తేదీన ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ ఏర్పాటు కానుంది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్‌ల మ్యాచ్‌ను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా టీమిండియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో అడుగు పెట్టింది. భారత జట్టు ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచింది.
దీనికి సంబంధించిన ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది కూడా. టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబాలకు దూరం అయ్యారు. త్వరలో ఇంగ్లాండ్ విమానం ఎక్కబోతోన్న నేపథ్యంలో వారంతా దశలవారీగా బయో బబుల్‌లోకి వెళ్లారు. కేప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే బయోబబుల్‌లోకి వెళ్లినట్లు తేలింది. మిగిలిన ఆటగాళ్లు త్వరలోనే వారితో జత కట్టనున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. వారి కోసం ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో బయో సెక్యూర్ బబుల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ కొనసాగుతోన్న సమయంలో వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ ఇద్దరూ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం వారు ఐసొలేషన్‌లోకి వెళ్లారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. బీసీసీఐకి తమ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను కూడా అందజేయడంతో వారికి ఇంగ్లాండ్ పర్యటనకు బెర్త్ కన్‌ఫర్మ్ అయింది. టీమిండియా ప్లేయర్లు వచ్చేనెల 2వ తేదీన ఇంగ్లాండ్‌కు బయలుదేరాల్సి ఉంది. 18న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముగిసిన తరువాత కూడా అక్కడే ఉంటుంది కోహ్లీ టీమ్.
డబ్ల్యూటీసీ ఫైనల్ తరువాత టీమిండియా ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘమైన టూర్ ఇది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాగా.. చివరి మ్యాచ్ ముగిసేసరికి సెప్టెంబర్ తొలి సగం ముగుస్తుంది. ఒకటిన్నర నెల ఇంగ్లాండ్‌లోనే గడపబోతోంది భారత క్రికెట్ జట్టు. ఆ తరువాత మళ్లీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సన్నద్ధం అవుతుంది. అన్నీ సవ్యంగా సాగితే.. ప్రపంచకప్ టోర్నమెంట్ కంటే ముందే- ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను కూడా ఆడే అవకాశాలు లేకపోలేదు.