
ముంబై: ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఉత్కంఠతకు గురి చేస్తోన్న టోర్నమెంట్.. ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్‌షిప్. ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటన తరువాత ఆరంభం కాబోతోన్న ఫైనల్ మ్యాచ్ ఇది. దీని తరువాత టీమిండియా ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘమైన టూర్ ఇది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కాగా.. చివరి మ్యాచ్ ముగిసేసరికి సెప్టెంబర్ తొలి సగం ముగుస్తుంది. ఒకటిన్నర నెల ఇంగ్లాండ్‌లోనే గడపబోతోంది భారత క్రికెట్ జట్టు.
ఇంగ్లాండ్‌లోని పోర్ట్ సిటీ సౌథాంప్టన్ క్రికెట్ స్టేడియం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికైంది. ఫైనల్‌లో న్యూజీలాండ్ జట్టును ఢీ కొట్టనుంది టీమిండియా. వచ్చేనెల 18వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభమౌతుంది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్‌ల మ్యాచ్‌ను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా టీమిండియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో అడుగు పెట్టింది. భారత జట్టు ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో న్యూజీలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లూ ఫైనల్‌లో తలపడబోతోన్నాయి.
ఇది క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. చారిత్రాత్మకంగా భావిస్తోన్న ఈ మ్యాచ్‌లో న్యూట్రల్ కామెంటేటర్‌గా వ్యవహరించే ఛాన్స్ దినేష్ కార్తీక్‌కు దక్కే అవకాశాలు ఉన్నాయి. లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి ఆయన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా ఎంపిక కావొచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఫైనల్‌లో ఆడబోతోన్న భారత్, న్యూజీలాండ్, దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోన్నందున ఇంగ్లాండ్ నుంచి కామెంటేటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేయనుంది.
క్రికెట్ జట్టు తరఫున సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్‌లను ఐసీసీ ఎంపిక చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే- దినేష్ కార్తీక్ తొలిసారిగా కామెంటరీ బాక్స్‌లో కనిపిస్తాడు. ఇప్పటిదాకా అతను కామెంటర్‌గా వ్యవహరించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. న్యూజీలాండ్ నుంచి సైమన్ డౌల్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఇంగ్లాండ్ తరఫున ఆ దేశ మాజీ క్రికెటర్లు నాజిర్ హుస్సేన్, మైక్ అథర్టన్‌లను తీసుకోవడం ఖాయమైనట్లు తెలుస్తోంది.