
వార్విక్‌షైర్ తరఫున:
2018 సిరీస్‌లో ఓవల్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన హనుమ విహారి అదే మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆపై ప్రతి మ్యాచులో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ రెగ్యులర్ ఆటగాడు అయ్యాడు. ఐపీఎల్ 2021లో చోటు దక్కకపోవడంతో గత ఏప్రిల్‌లో విహారి వార్విక్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడాడు. నాటింగ్‌హామ్ షైర్‌పై అరంగేట్రం మ్యాచులో 23 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ పెవిలియన్ చేరాడు. మూడు మ్యాచుల్లో ఒక్క అర్ధ శతకమే చేసినప్పటికీ.. ఇంగ్లండ్ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నాడు.

రోజంతా బంతి స్వింగ్ అవుతుంది:
క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హనుమ విహారి పలు అంశాలపై స్పందించాడు. 'ఇంగ్లండ్‌లో వాతావరణమూ ఆటలో కీలకం అవుతుంది. ఎండ కాస్తున్నప్పుడు బ్యాటింగ్ సులభం. అదే మబ్బులు వచ్చాయంటే రోజంతా బంతి స్వింగ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా డ్యూక్ బంతులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. బౌలర్లకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రీజ్‌లో నిలదొక్కుకున్నామని అనిపించిన సమయంలో కూడా అనూహ్య స్వింగ్ చాలా ఇబ్బంది పెడుతుంది. డ్యూక్ బంతులపై సీమ్ ఎక్కువగా ఉండటం కూడా ఓ కారణం' అని విహారి తెలిపాడు.

ఆ షాట్ భారత్‌లో ఆడిఉంటే:
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఔటైన తీరును బట్టి చూస్తే భారత ఆటగాళ్లు కొన్ని మార్పులు చేసుకోవాలని హనుమ విహారి సూచించాడు. 'బ్రాడ్ వేసిన బంతి డ్రైవ్ చేసేందుకు అనువుగా ఉందనే అనుకున్నాను. కానీ ఇంగ్లండ్‌లో ఏ షాట్ ఎంచుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. భారత్‌లో అయితే అలాంటి బంతిని సులభంగా పుష్ చేయొచ్చు. కుదరకపోతే పైనుంచి ఎలాగోలా డ్రైవ్ ఆడొచ్చు. అదే బంతిని నేను రెండోసారి ఆడాల్సి వస్తే మాత్రం సాధ్యమైనంత ఆలస్యంగా ఆడతాను. అదే తరహా షాట్ నేను భారత్‌లో ఆడిఉంటే అవుట్ కాకపోయేవాడిని. ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు షాట్ సెలక్షన్ చాలా ముఖ్యం' అని హైదరాబాద్ ఆటగాడు విహారి పేర్కొన్నాడు.

స్టాన్స్ మార్చుకున్నా:
లైన్‌కు సమీపంగా ఆడేందుకు హనుమ విహారి మిడిల్‌స్టంప్ గార్డ్ తీసుకోవడం గమనార్హం. 'సాధారణంగా ఆస్ట్రేలియాలో లేటరల్ మూమెంట్ ఉండదు. లెగ్ గార్డ్ తీసుకోవచ్చు. అదే ఇంగ్లండ్‌లో అయితే లైన్‌కు సమీపంగా ఆడాలి. ఆఫ్ స్టంప్‌ను జాగ్రత్తగా చూసుకొని ఆలస్యంగా ఆడాలి. ఎందుకంటే ఇక్కడ బంతి స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టాన్స్ మార్చుకున్నా. ఈ అనుభవమే నాకు పెద్ద బలం. టీమిండియా తరఫున బాగా ఆడేందుకు ఇదంతా అక్కరకొస్తుంది. పరుగులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా' అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.

ఆట చాలా మెరుగైంది:
2018తో పోలిస్తే ఇప్పుడు తన ఆటతీరు మారిందని విహారి అన్నాడు. '2018లో నా మొదటి టెస్టు ఆడాను. అనుభవం లేని కుర్రాడిని. బ్యాటింగ్ చేసేటప్పుడు కాళ్ల కదలికలు కూడా భిన్నంగా ఉండేవి. అందుకే జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వేసే ఇన్‌స్వింగర్లను ఎలా ఆడాడో విరాట్ కోహ్లీ సూచించాల్సి వచ్చింది. వాటిని నేను అమలు చేశాను. అయితే ఇప్పుడు నా ఆట చాలా మెరుగైంది. స్వింగర్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. నా బ్యాటింగ్‌పై నియంత్రణ పెరిగింది. క్రీజ్‌లో కదలికలు ఎలా ఉండాలో బాగా తెలుసు. అదనంగా కౌంటీ అనుభవం కూడా వచ్చింది' అని అన్నాడు.


Click it and Unblock the Notifications












