
హైదరాబాద్: సౌథాంప్టన్‌లో పరిస్థితులు స్వింగ్, సీమ్‌కు అనుకూలిస్తే టీమిండియాకు తీవ్ర ఇబ్బందులు తప్పవని న్యూజిలాండ్ మాజీ సారథి గ్లెన్ టర్నర్ అన్నాడు. సౌథాంప్టన్‌లో కెప్టె విరాట్ కోహ్లీతో పాటు బ్యాట్స్‌మెన్ అంతా శ్రమించాల్సి వస్తుందన్నాడు. గతంలో న్యూజిలాండ్‌కు వచ్చిన భారత జట్టు తమ పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయిందని ఆయన గుర్తుచేశాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా సమరం కోసం కోహ్లీసేన ప్రాక్టీస్ చేస్తోంది.
తాజాగా గ్లెన్ టర్నర్ 'ది టెలిగ్రాఫ్'తో మాట్లాడుతూ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచుపై స్పందించాడు. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు న్యూజిలాండ్ మాదిరిగానే ఉంటాయని, ఇది కేన్ విలియమ్సన్ జట్టుకు అనుకూలించే అంశం అన్నారు. 'ఈ మధ్యకాలంలో భారత్‌లో పిచ్‌లు సీమ్‌కు అనుకూలిస్తున్నా.. న్యూజిలాండ్ పరిస్థితులతో పోల్చలేం. గత పర్యటనలో టీమిండియా ఇక్కడికి (కివీస్) వచ్చినప్పుడు ఇదే బయటపడింది. ఇంగ్లండ్ పరిస్థితులు సాధారణంగా న్యూజిలాండ్ తరహాలో ఉంటాయి. ఇది కివీస్ జట్టుకు కలిసొచ్చే అంశం' అని అన్నాడు.
'విరాట్ కోహ్లీ ఇబ్బందుల గురించి చెప్పాలని అనుకోవడం లేదు. పిచ్, పరిస్థితులు సీమ్, స్వింగ్‌కు అనుకూలిస్తే మాత్రం అతడు ఇబ్బంది పడతాడు. కోహ్లీతో పాటు ఇతర భారత బ్యాట్స్‌మెన్‌కూ తిప్పలు తప్పవు. న్యూజిలాండ్‌లో గతంలో ఇదే జరిగింది. అందుకే మరోసారీ పరిస్థితులే కీలకం కానున్నాయి. ఏదేమైనా ఆటగాడి బ్యాటింగ్ టెక్నిక్, నైపుణ్యాల్లో సొంతదేశం పరిస్థితుల ప్రభావం ఉంటుందనడం నిజం' అని న్యూజిలాండ్ మాజీ సారథి గ్లెన్ టర్నర్ పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచుకు ముందు ఇంగ్లండ్‌తో కివీస్ 2 టెస్టులు ఆడనుండడం కేన్ సేనకు అదనపు ప్రయోజనం అని చెప్పారు. 2020 న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీ కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు.
తాజాగా ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డబ్ల్యూటీసీ ఫైనల్, భారత బౌలింగ్ విభాగంపై కేన్ విలియమ్సన్ స్పందించాడు. 'విరాట్ కోహ్లీతో కలిసి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ టాస్‌కు రావడం చాలా బాగుంటుంది. టీమిండియా పటిష్ట జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. కోహ్లీసేనతో పోటీ కఠినంగానే ఉంటుంది. కొన్నేళ్లుగా మా రెండు జట్లు వేర్వేరు ఫార్మాట్లలో తలపడ్డాయి. ఎవరెలా ఆడతారో పరస్పరం అవగాహన ఉంది. అందుకే టాస్‌కు రావడం, కోహ్లీచాలా తో మాట్లాడటం, ఫైనల్లో పోటీ పడటం బాగుంటుంది' అని విలియమ్సన్ అన్నాడు.