
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ అభిమానులకు ఎంత ఉత్కంఠతకు గురి చేస్తోందో.. టీమిండియా టీ20 ఫార్మట్ బ్యాట్స్‌మెన్, కోల్‌కత నైట్ రైడర్స్ డాషింగ్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కామెంటరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా మారింది. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో కనిపించాల్సిన దినేష్ కార్తిక్.. దీనికి భిన్నంగా కొత్త అవతారం ఎత్తాడు. మైక్ పట్టుకుని కామెంటరీ బాక్స్‌లో కూర్చున్నాడు. అక్కడా బ్యాటింగే ఆడుతోన్నాడతను.
ఇప్పటిదాకా కామెంటేటర్‌గా వ్యవహరించిన అనుభవం అతనికి లేదు. అయినప్పటికీ- తొలి రోజు తన మార్క్ కామెంటరీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ నాజిర్ హుస్సేన్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు దినేష్ కార్తిక్. అతణ్ని ఓ ఆట ఆడేసుకున్నాడు. స్లెడ్జింగ్‌తో విరుచుకుపడ్డాడు. నాజిర్ హుస్సేన్ చేసిన కామెంట్స్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్నందున.. ఆ దేశం తరఫున ఇద్దరు మాజీ క్రికెటర్లు నాజిర్ హుస్సేన్, మైక్ అథర్టన్ కామెంటేటర్లుగా వ్యవహరిస్తోన్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట ఆరంభమైన తరువాత.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని ఉద్దేశించి నాజిర్ హుస్సేన్ కామెంట్స చేశాడు. షార్ట్‌బాల్‌ను పుల్ చేయడంలో రోహిత్ శర్మకు తిరుగు లేదని పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో అతని ఫుట్‌వర్క్ బాగుంటుందని చెప్పుకొచ్చాడు. కొంత పాజిటివ్ ఇంటెంట్‌ను రోహిత్ చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.
తొలి రెండు లైన్లు బాగానే ఉన్నప్పటికీ- పాజిటివ్ ఇంటెంట్ చూపించాలనే పదం డీకేకు నచ్చలేదేమో. అందుకే ఇమ్మీడియట్‌గా కౌంటర్ ఇచ్చాడు. నాజిర్ హుస్సేన్ బ్యాటింగ్ శైలికి పూర్తి వ్యతిరేకంగా రోహిత్ శర్మ ఆడుతున్నాడంటూ కౌంటర్ ఇచ్చాడు. అతను చేసిన ఈ సింగిల్ లైన్ కామెంట్.. టీమిండియా అభిమానులను కట్టిపడేసింది. అతణ్ని ఓవర్ నైట్ హీరోను చేసింది. నాజిర్ హుస్సేన్‌పై దినేష్ కార్తిక్ స్లెడ్జింగ్ చేస్తోన్నాడంటూ మెమెస్ ప్రిపేర్ చేసి, ట్వీట్లు చేస్తోన్నారు.