
ముంబై: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఇంగ్లండ్ టెస్టులకు ఎంపికైన భారత క్రికెటర్లు.. అక్కడికి వెళ్లే ముందు 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు బీసీసీఐ ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా చేయనున్నారు. ఇంగ్లండ్ పర్యటన కోసం 20 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నలుగురు స్టాండ్‌బై ప్లేయర్స్ కూడా ఉన్నారు.
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయిన భారత ఆటగాళ్లు 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటారు. ఆ సమయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టులను ఆటగాళ్ల ఇంటివద్దే బీసీసీఐ నిర్వహిస్తుంది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లాలనుకున్న ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాలి. కోచింగ్, సహాయ సిబ్బందికి కూడా ఇవే రూల్స్ ఉంటాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా ఆగిపోవడంతో బీసీసీఐ కఠిన నియమాలను అమలు చేస్తోంది.
హోమ్ క్వారంటైన్ అనంతరం ఈ నెల 23న టీమిండియా ఆటగాళ్లు మొదటగా ముంబై చేరుకుంటారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ (వారం రోజులు) అనంతరం జూన్ 2న ముంబై నుంచి టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌కి వెళ్లనున్నారు. ఒకవేళ క్రికెటర్‌లో ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా తేలితే.. జట్టు నుంచి అతడ్ని వెంటనే తప్పించనున్నారు. ఇంగ్లీష్ గడ్డపై మరో క్వారంటైన్ అనంతరం న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడతారు. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన ఢీకొట్టబోతోంది.
భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్. ఇక కేఎల్ రాహుల్, సాహాలను ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత ఎంపిక చేయనున్నారు
స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా