WTC Final 2025: క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ మ్యాచ్‌ను సౌతాఫ్రికా జట్టు అద్భుతంగా ప్రారంభించింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు రెండు పెద్ద షాకులను ఇచ్చింది. తొలి 10 ఓవర్లలోనే కగిసో రబాడ తన సత్తాను చాటాడు.
కగిసో రబాడ ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఖవాజా ఒక్క పరుగు కూడా చేయకుండానే.. 20 బంతులు ఆడి డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. చాలా కాలం తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చిన కామెరూన్ గ్రీన్ కూడా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

కగిసో రబాడ విజృంభణ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ దక్షిణాఫ్రికా అనుకూలంగా పడటంతో, కెప్టెన్ టెంబా బావుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. కగిసో రబాడ, మార్కో జాన్సెన్ తొలి మూడు ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌లకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. రబాడ, జాన్సెన్ వ్యూహంలో ఖవాజా పూర్తిగా చిక్కుకుపోయాడు. రబాడ వేసిన ఏడో ఓవరల్ మూడో బంతి స్వింగ్ అయ్యి ఖవాజా బ్యాట్ అంచుకు తాకింది. స్లిప్‌లో ఉన్న డేవిడ్ బెడింగ్‌హామ్ క్యాచ్ అందుకోవడంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. ఖవాజాను డకౌట్ చేసిన తర్వాత రబాడ్ అదే ఓవర్లో గ్రీన్‌ను కూడా ఔట్ చేశాడు. ఓవర్ చివరి బంతి గ్రీన్ బ్యాట్ లోపలి అంచుకు తగిలి మార్‌క్రమ్ చేతుల్లోకి వెళ్లింది. గ్రీన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
టెంబా బవుమా అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాకు టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు ఉంది. బవుమా కెప్టెన్సీలో ఇప్పటివరకు సౌతాఫ్రికా జట్టు ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలు కాలేదు. బవుమా ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించగా.. వాటిలో ఆ జట్టు 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు ఈ రికార్డును డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా బవుమా కొనసాగించగలుగుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.