WTC Prize Money: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) కీలక ప్రకటన చేసింది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఐసీసీ ప్రైజ్ మనీని పెంచింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ విజేతకు ఇప్పుడు రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ సారి ప్రైజ్‌మనీ గత సారి కంటే రెట్టింపు కంటే ఎక్కువ. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రపంచంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
డబ్ల్యూటీసీ ప్రైజ్ మనీని రెట్టింపు చేసిన ఐసీసీ
2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం మొత్తం ప్రైజ్ మనీ 5.76 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ.49.27కోట్లు) అని ఐసీసీ వెల్లడించింది. ఇది గత రెండు సార్లు కంటే చాలా ఎక్కువ. ఛాంపియన్ జట్టుకు 3.6 మిలియన్ అమెరికన్ డాలర్లు అందుతాయని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది 2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇచ్చిన 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ. రన్నరప్ జట్టు 2.16 మిలియన్ డాలర్లను అందుకుంటుంది. ఇది గతంలో ఇచ్చిన 8 లక్షల డాలర్ల కంటే చాలా ఎక్కువ.

ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోనున్న దక్షిణాఫ్రికా
2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. వారు పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై సిరీస్‌లను గెలుచుకున్నారు. దీనితో పాటు భారత్‌తో జరిగిన సిరీస్ డ్రా అయింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌ను 3-1 తేడాతో ఓడించి ఆస్ట్రేలియా అర్హత సాధించింది. ఈ సారి భారత్ మూడో స్థానంలో నిలిచింది. రెండు సార్లు రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు 1.44 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ.12.31కోట్లు) అందుకుంటుంది. ప్రైజ్ మనీ పొందుతున్న జట్లలో భారత్ మూడో స్థానంలో ఉంది.
ప్రకటించిన ఐసీసీ ఛైర్మన్ జైషా
ఈ ప్రకటనపై ఐసీసీ ఛైర్మన్ జైషా మాట్లాడుతూ.. "ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో చాలా ఆసక్తికరమైన మూడో రౌండ్ ను చూశామని.. ఫైనల్స్‌కు చేరే జట్లను చివరి వరకు నిర్ణయించలేకపోయారన్నారు. ఈ ఛాంపియన్ షిప్‌లో వివిధ జట్ల ఆటగాళ్లు అద్భుతంగా రాణించారన్నారు. ఫలితంగా రెండు అత్యుత్తమ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయన్నారు. లార్డ్స్‌లో జరిగే ఈ వేడుకను ప్రేక్షకులు, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న అభిమానులు గొప్ప క్రికెట్‌ను ఆస్వాదిస్తారని తాను అనుకుంటున్నానన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఒక నెలలోపు మైదానంలోకి దిగుతాయన్నారు.
ఐసీసీ ప్రపంచ ఛాంపియన్ షిప్ 2023-25 ప్రైజ్‌మనీ వివరాలు ఇలా..
విజేత (ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా): 3,600,000 యూఎస్ డాలర్లు
రన్నరప్ (ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా): 2,160,000 యూఎస్ డాలర్లు
3వ స్థానం (భారతదేశం): 1,440,000 యూఎస్ డాలర్లు
4వ స్థానం (న్యూజిలాండ్): 1,200,000 యూఎస్ డాలర్లు
ఐదవ స్థానం (ఇంగ్లాండ్): 960,000 యూఎస్ డాలర్లు
6వ స్థానం (శ్రీలంక): 840,000 యూఎస్ డాలర్లు
7వ స్థానం (బంగ్లాదేశ్): 720,000 యూఎస్ డాలర్లు
8వ స్థానం (వెస్టిండీస్): 600,000 యూఎస్ డాలర్లు
9వ స్థానం (పాకిస్తాన్): 480,000 యూఎస్ డాలర్లు
ఈసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీ మొత్తంలో డబ్బు అందనుంది. ఇది టెస్ట్ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, ఆటగాళ్ళు బాగా రాణించడానికి ప్రేరణ కూడా పొందుతారు. ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.