డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంపై అటు ఫ్యాన్స్, ఇటు మాజీలు అసంతృప్తిగానే ఉన్నారు. ఈ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా ఆ అసహనం మాత్రం తీరడం లేదు. ఈ క్రమంలో మరో మాజీ ప్లేయర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ విషయంపై మాట్లాడాడు. టీమిండియా బ్యాటింగ్ చాలా ఏళ్లుగా సమస్యాత్మకంగానే ఉందని అతను చెప్పాడు.
విదేశాల్లో భారత్ ఆడిన మ్యాచుల్లో టీమిండియా టాపార్డర్ వరుసగా ఫెయిలవుతూనే ఉందని మండిపడ్డాడు. 2022 నుంచి టీమిండియా టాప్ ఫోర్ ఆటగాళ్లు పరుగులు చేయడం చాలా తక్కువ అని, కేవలం 33.4 సగటుత వాళ్లు పరుగులు చేశారని చెప్పాడు. ఇది పాకిస్తాన్ కన్నా తక్కువని గుర్తుచేశాడు. టాప్-4 బ్యాటర్ల సగటులో భారత్ అత్యంత తక్కువగా ఉందని చెప్పాడు.

ఇలా టాపార్డర్ సగటు చూస్తే.. ఇంగ్లండ్ (39.9), శ్రీలంక (44.6), న్యూజిల్యాండ్ (45.1), పాకిస్తాన్ (46.7), ఆస్ట్రేలియా (48.8)గా ఉన్నాయి. భారత్ ఈ జాబితాలో చాలా దారుణమైన స్థానంలో ఉంది. 'ఈ లిస్టులో భారత జట్టు 33.4 సగటుతో చివరి స్థానంలో ఉంది. చివరి మూడేళ్లు చూసుకున్నా.. కేవలం ఒకరిద్దరు ఏదో ఆడినట్లు గుర్తు. మిగతా వాళ్లు అందరూ ఫామ్ లేక తంటాలు పడిన వాళ్లే. అందుకే మనం ఓడిపోయాం' అని చెప్పాడు.
టాప్-5 బ్యాటర్లలో కనీసం ముగ్గురైనా ఫామ్‌లో ఉండాలని, అప్పుడే టీం సక్సెస్ అవుతుందని మంజ్రేకర్ అన్నాడు. విదేశాల్లో ఆడిన టెస్టుల్లో టీమిండియాలో కేవలం రిషభ్ పంత్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడని, అతని వల్లే విదేశాల్లో చాలా మ్యాచులు భారత్ గెలిచిందని చెప్పాడు. బంగ్లాదేశ్ టెస్టులు మినహా.. మిగతా ఏ విదేశీ టెస్టు సిరీస్‌లో భారత టాప్-6 ఆటగాళ్ల ఫామ్ సరిగా లేదని పేర్కొన్నాడు. ఈ సమస్య భారత్‌ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోందన్నాడు.