
సౌథాంప్టన్: టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. పేసర్ కైల్ జేమిన్సన్ వేసిన 21 ఓవర్ మొదటి బంతికి టీమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔట్ అయ్యాడు. హిట్‌మ్యాన్ 68 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. అంతకుముందు గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. మరికొద్ది సేపటికే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (28) కూడా ఔట్ అయ్యాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడారు. వర్షం పడడంతో పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలంగా మారింది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కట్టుదిట్టంగా బంతులేస్తున్నా.. ఇద్దరూ వారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. భారీ షాట్లు ఆడకుండా, వికెట్ కాపాడుకుంటూ నిదానంగా క్రీజులో కుదురుకున్నారు. ఇక సౌథీ వేసిన ఏడో ఓవర్‌లో రోహిత్ రెండు ఫోర్లు బాది 10 రన్స్ రాబట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ భారత్ స్కోరును 50 పరుగులు దాటించారు. జేమీసన్ వేసిన 20.1 ఓవర్‌కు ఓపెనర్ రోహిత్‌శర్మ(34; 68 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. స్లిప్‌లో సౌథీ చేతికి చిక్కడంతో భారత్ 62 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరికొద్ది సేపటికే నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో గిల్ (28; 64 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. 24.3 ఓవర్‌కు వికెట్ల వెనుక కీపర్ వాట్లింగ్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 63 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు చేటేశ్వర్ పుజారా ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. భారత్ 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 రన్స్ చేసింది.