
సౌథాంప్టన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరుకు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టైటిల్ పట్టేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే తాపీగా మ్యాచ్ చూద్దామని ఆశించిన అభిమానులకు బ్యాడ్ న్యూస్. తొలిరోజు ఆట జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వేదిక అయిన సౌథాంప్టన్‌లోని రోజ్ బౌల్ వద్ద ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో సిబ్బంది మైదానంలోని పిచ్‌ను కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ప్రారంభం కానున్న శుక్రవారం (జూన్ 18)న కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తొలిరోజు ఆట సాగడం కష్టమే అని తెలుస్తోంది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఇంగ్లండ్ వాతావరణ శాఖ, అక్కడి వెబ్‌సైట్లు చెప్పాయి. దాదాపు 80% వర్షం కురుస్తుందని వెల్లడించాయి. అదే నిజమవుతోంది.
ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పొంచివున్న వర్ష గండంపై ఇప్పటికే ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 18 నుంచి 23 వరకు సౌథాంప్టన్ వాతావరణం ఎలా ఉంటుందో వివరాలు పోస్ట్ చేశారు. ఫైనల్ మ్యాచుకు ఒకరోజు ముందే వర్షం మొదలవుతుందన్నది పనేసర్ పేర్కొన్నారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. మ్యాచ్ సజావుగా జరగడం దాదాపు అసాధ్యమే. మ్యాచుకు వర్షం అంతరాయం కలిగిస్తే.. భారత్, న్యూజిలాండ్‌ను ఐసీసీ సంయుక్త విజేతగా ప్రకటిస్తుంది.
ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగబోతోంది. స్పిన్నర్లు ఆర్ అశ్విన్, ఆర్ జడేజా ఇద్దరూ బ్యాటింగ్ చేసే అవకాశం ఉండటంతో మేనేజ్‌మెంట్ తుది జట్టులో వారికి చోటు కల్పించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.