అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టబోతోన్నాయి. లోకల్ టీమ్ గుజరాత్ టైటాన్స్- వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం- ఈ మ్యాచ్‌కు వేదిక.
ఈ సీజన్ ముగిసిన వెంటనే ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమౌతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. రెండేళ్లకోసారి జరిగే ఫైనల్ ఇది. 2021లో సౌథాంప్టన్‌లో జరిగిన లో- స్కోర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. ఆ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది న్యూజిలాండ్.

ఇప్పుడు ఆస్ట్రేలియాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వచ్చే జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగనుందీ మ్యాచ్. లండన్‌లోని ఓవల్ స్టేడియం ఈ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోతోంది భారత్. ఆదివారం నాటితో ఐపీఎల్ ముగియనున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో టీమిండియా ప్లేయర్లందరూ లండన్ బయలుదేరి వెళ్లనున్నారు.
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ లండన్ వెళ్లారు. ఇటీవలే తన భార్య అనూష్క శర్మతో కలిసి లండన్ ఫ్లైట్ ఎక్కడు విరాట్ కోహ్లీ. అక్కడ తాజాగా ఓ ఇండియన్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పలు కీలక అంశాలపై మాట్లాడాడు. తన కేప్టెన్సీలో టీమిండియా సాధించిన విజయాలను ప్రస్తావించాడు కోహ్లీ.
జాతీయ జట్టుకు కేప్టెన్‌గా పగ్గాలను అందుకోవడం- తన కేరీర్‌లో అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. కేప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించినప్పుడు దాన్ని భారంగా భావించలేదని పేర్కొన్నాడు. ఎక్కడా ఒత్తిళ్లకు తలొగ్గకూడదంటూ అప్పుడే నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను అత్యుత్తమ జట్టుగా నిలబెట్టాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.
వచ్చే ఏడెనిమిది సంవత్సరాల్లో ప్రపంచ క్రికెట్‌పై భారత్ ఆధిపత్యాన్ని సాధించేలా ఒక విజన్‌ను అప్పుడే రూపొందించుకున్నానని, దానికి అనుగుణంగా ఓ సారధిగా జట్టును ముందుకు నడిపించానని అన్నాడు. అప్పుడు తాను ఊహించిందే ఇప్పుడు జరుగుతోందని, ప్రపంచ క్రికెట్‌పై టీమిండియా ఆధిపత్యాన్ని సాధించిందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
జట్టుకు కెప్టెన్‌గా విజన్‌తో పని చేయాల్సిన అవసరం ఉందని తాను ఎప్పుడూ భావిస్తుంటానని, అదే నాయకత్వ లక్షణమని వ్యాఖ్యానించాడు. స్పోర్ట్స్ నుంచే ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, దీనికి మించి తనకు ఏదీ లేదని పేర్కొన్నాడు. ఓడిపోయిన ప్రతీసారీ ఓ గుణపాఠాన్ని నేర్చుకునే అవకాశం క్రీడారంగంలోనే ఉందని, మళ్లీ ఏ విధంగా విజయం సాధించాలనేది ఆ ఓటమి నేర్పిస్తుందని అన్నాడు.