మెల్‌బోర్న్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ జట్టును చూస్తోంటే- ఫైనల్ గెలవడానికి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చెమటోడ్చడం తప్పకపోవచ్చు. రెండేళ్లకోసారి జరిగే ఫైనల్ మ్యాచ్ ఇది. 2021లో సౌథాంప్టన్‌లో జరిగిన లో- స్కోర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. ఆ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది కివీస్.
ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్స్ వరకు చేరుకోలేకపోయింది. టెస్టుల్లో నిలకడగా రాణించిన టీమిండియా ఈ దఫా కూడా ఫైనల్స్‌కు చేరుకోగలిగింది. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ప్రత్యర్థిగా న్యూజిలాండ్ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆక్రమించింది. ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భారత జట్టును ఎదుర్కొనబోతోంది. ఈ రెండింట్లో ఏది గెలిచినా- డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించిన మొదటి జట్టవుతుంది.

వచ్చే జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. లండన్‌లోని ఓవల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఇందులో భారత జట్టును ఎదుర్కొనబోయే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టెస్ట్ ఫార్మట్ రెగ్యులర్ కేప్టెన్, ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ జట్టుకు నాయకత్వాన్ని వహించనున్నాడు.
స్టీవెన్ స్మిత్‌కు వైస్ కేప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. వన్డే, టీ20 స్పెషలిస్టులతో టెస్ట్ టీమ్‌ను రెడీ చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్. ఆల్ రౌండర్ మిఛెల్ మార్ష్‌ను మళ్లీ టెస్ట్ ఫార్మట్ క్రికెట్‌లో చోటు కల్పించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రకటించిన జట్టులో అతన్ని తీసుకుంది. నాలుగు సంవత్సరాల తరువాత మొదటిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడబోతోన్నాడు మిఛెల్ మార్ష్.
పాట్ కమ్మిన్స్ కేప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో- స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హ్యారీస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, మార్నుస్ లాంబుషెన్, నాథన్ లియాన్, మిఛెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవెన్ స్మిత్ (వైస్ కేప్టెన్), మిఛెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్‌కు చోటు కల్పించింది. వీరిలో చాలామంది ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడుతున్నారు.