ముంబై: ట్వంటి20 ప్రపంచకప్ తమ తొలి మ్యాచ్‌లో గేల్ అజేయ సెంచరీతో ఓటమి చవిచూసిన ఇంగ్లాండు దక్షిణాఫ్రికాపై ఘనమైన విజయాన్ని సాధించింది.సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో అద్భుత విజయం సొంతం చేసుకుంది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండు మరో రెండు బంతులు మిగిలుండగానే 8వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జాసన్ రాయ్(16 బంతుల్లో 43) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మొదలైన ఇంగ్లండ్ జోరు మిడిలార్డర్‌లో జోరూట్(44 బంతుల్లో 83 పరుగులు) వీరోచిత అర్ధసెంచరీతో వాంఖడేలో బౌండరీలే లక్ష్యంగా పరుగుల ప్రవాహం కొనసాగింది.

సఫారీ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చిత్తుగా కొట్టారు. ముఖ్యంగా రూట్ తన ఇన్నింగ్స్‌లో 6ఫోర్లు, 4 భారీ సిక్స్‌లతో ఇంగ్లాండు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో మైదానం నలువైపులా షాట్లతో రూట్ ప్రేక్షకులను అలరించాడు.
ఈ క్రమంలో కొన్ని రికార్డులు బద్దలయ్యాయి. ఓవరాల్‌గా టీ20ల్లో భారీ లక్ష్యం పరంగా ఇది రెండో అత్యుతమ ఛేజ్ కాగా, టీ20 ప్రపంచకప్‌లో మొట్టమొదటిది కావడం విశేషం. ఇంతకుముందు ఇదే దక్షిణాఫ్రికాపై నిరుడు వెస్టిండీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టాప్‌లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మెరుపు దాడులను తట్టుకుంటూ అబాట్(3/41), రబాడ(2/50) ఆకట్టుకున్నారు. జోరూట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓపెనర్లు డీకాక్(52), ఆమ్లా (58) అర్ధసెంచరీలతో జట్టుకు మంచి ఆరంభాన్నిఅందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే వీరి నిష్క్రమణ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ డుప్లెసి(17), డివిలీయర్స్(16) నిరాశపరిచారు. ఆఖర్లో డుమిని(28 బంతుల్లో 54 నాటౌట్), మిల్లర్(28 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో సఫారీ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అలీ(2/34) రెండు వికెట్లతో రాణించగా, విల్లే, రషీద్ ఒక్కో వికెట్ తీశారు.