కోల్‌కతా: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో శ్రీలంక బోణీ చేసింది. గురువారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ తమకు నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యఛేదనలో మరో ఏడు బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
గత కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న సీనియర్ బ్యాట్స్‌మన్ దిల్షాన్ ధాటిగా ఆడి శ్రీలంకకు విజయాన్ని సాధించి పెట్టాడు. ఆఫ్ఘన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ దిల్షాన్ (56 బంతుల్లో 83నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేశాడు.

తన ట్రేడ్‌మార్క్ దిల్‌స్కూప్ షాట్లతో అలరించిన దిల్షాన్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి పోయాడు. ఒకవైపు సహచర బ్యాట్స్‌మెన్ ఔటై పెవిలియన్‌కు చేరుతున్నా పట్టువదలకుండా షాట్లు కొడుతూ వెళ్లాడు. ఓ దశ లో ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం తో మ్యాచ్ రసపట్టులో పడింది. అయితే ఆఖర్లో కెప్టెన్ మాథ్యూస్(10 బంతుల్లో 21 నాటౌట్) అండతో జ ట్టును గెలిపించిన దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నబీ, రషీద్ ఒక్కో వికెట్ తీశారు.
గ్రూపు-1 తొలి మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కెప్టెన్ అస్గర్ (47 బంతుల్లో 62) అర్ధసెంచరీ చేసి గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించాడు.

అర్ధసెంచరీ చేరుకునే క్రమంలో అస్గర్ 34, 44 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను లంక ఫీల్డర్లు జారవిడిచాడు. దీన్ని అదునుగా చేసుకుని ఈ ఆఫ్ఘన్ కెప్టెన్ మూడు ఫోర్లు, నాలుగు భారీ సిక్స్‌లతో ప్రేక్షకులను అలరించాడు. తిసార పెరెర వేసిన ఓ ఓవర్లోనైతే అస్గర్ ఒంటికాలిపై నిలబడి స్ట్రేట్ డ్రైవ్‌లో కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
తొలుత మందకోడి బ్యాటింగ్‌తో ఆఫ్ఘన్ మొదటి పది ఓవర్లలో కేవలం 47 పరుగులే చేసింది. అయితే 51 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లు కోల్పోయిన దశలో సమీవుల్లా షెన్వారీ(31)తో కలిసి అస్గర్ ఐదో వికెట్‌కు 61 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇలా వీరికి తోడు ఆఖర్లో నజీబుల్లా జర్దాన్(3 బంతుల్లో 12) బ్యాట్ ఝులిపించడంతో చివరి పది ఓవర్లలో ఆఫ్ఘన్ స్కోరుకు 106 పరుగులు జతకలిశాయి. లంక బౌలర్లలో తిసార పెరెర (3/33) మూడు వికెట్లు, సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్ (2/24) రెండు వికెట్లు తీశారు.