హైదరాబాద్: టెస్టుల్లో టీమిండియాకు వికెట్ కీపర్‌గా పార్థివ్ పటేల్ కంటే కోల్‌కతా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాకే తొలి ప్రాధాన్యం ఉంటుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇరానీ కప్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా డబుల్ సెంచరీతో చెలరేగడంతో రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
సాహానే నెంబర్ వన్: 'కీపర్‌గా అతడికే మా ఓటు'
379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్టాఫ్ ఇండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు హెర్వాద్కర్ (20), ముకుంద్ (19)లతో పాటు కరుణ్ నాయర్ (7), మనోజ్ తివారి (7) పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాహా, ఛటేశ్వర్ పుజారా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

266/4 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన సాహా 272 బంతుల్లో 26 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 203 పరుగులు చేసి రెస్టాఫ్ ఇండియాకు చిరస్మణీయమైన విజయాన్ని అందించాడు. సాహాకి తోడుగా సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్, రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ ఛటేశ్వర్ పూజారా 116 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు.
సాహా డబుల్ సెంచరీతో ఇరానీ కప్ రెస్టాఫ్ ఇండియాదే
వీరిద్దరూ అజేయంగా 316 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ దేశవాళీ క్రికెట్‌లో పార్ధీవ్ పటేల్ రాణించినా... టెస్టుల్లో సాహా విజయవంతమైన ఆటగాడని కొనియాడాడు.
కేవలం గాయం కారణంగా అతను టీమిండియాకు దూరమయ్యాడు. కావున సాహాకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. పార్థివ్ మెరుగైన ఆటగాడైనా ఇంకా కొన్ని రోజులు వేచిచూడాలని సౌరభ్ గంగూలీ అన్నాడు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం మంగళవారం టెస్టు జట్టుకు కీపర్‌గా ఎంపికయ్యే వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లో నెంబర్ వన్ చాయిస్ వ్యాఖ్యానించాడు. దీంతో ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తూ గంగూలీ వ్యాఖ్యానించడం విశేషం.