
హైదరాబాద్: ఇటీవల గాయం కారణంగా మైదానానికి దూరమైన వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ ఏడాది డిసెంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. గాయం కారణంగా జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కు సాహా దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లో చికిత్స చేయించుకొని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ డిసెంబర్‌లో తిరిగి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడతానంటూ చెప్పుకొచ్చాడు.
సంవత్సరారంభం నుంచి సాహా గాయాలతోనే కాలం వెల్లదీస్తున్నాడు. ముందుగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడి ఏకంగా సిరీస్ నుంచే వైదొలిగాడు. అనంతరం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడినా.. చివర్లో మళ్లీ చేతి వేలికి గాయానికి గురైయ్యాడు. అనంతరం అఫ్గానిస్థాన్‌తో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఇదిలా ఉండగా ఇటీవల సెలక్షన్ కమిటీ ఆసీస్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రిషబ్ పంత్, పార్ధీవ్ పటేల్‌కు అవకాశం కల్పించారు.
'గాయం నుంచి కోలుకుంటున్న నేను.. ప్రస్తుతం బాగానే ఉన్నా. అన్నీ అనుకూలిస్తే.. ఈ డిసెంబర్‌లో రంజీ ట్రోఫీలో ఆడతానని ఆశిస్తున్నా. దీనికి సంబంధించి ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను.' అని ఈ వికెట్‌కీపర్ పేర్కొన్నాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే మళ్లీ దేశవాళీ టోర్నీల్లో రాణిస్తేనే అది సాధ్యమవుతుందని సాహా తెలిపాడు. ప్రతి ఒక్కరూ అక్కడి నుంచే ఆరంభించాలని చెప్పుకొచ్చాడు. దేశవాళీలో అత్యుత్తమ ప్రదర్శన చేసి.. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తేనే తిరిగి సెలక్టర్ల నుంచి పిలుపు కోసం ఎదురుచూడాలని పేర్కొన్నాడు.