టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో సహా దేశవాళీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తన కెరీర్‌లో ఆఖరిదని తెలిపాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన సాహా 2021 వరకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులకు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎంతో కాలం భారత తొలి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా బాధ్యతలు వహించాడు.
రిషభ్ పంత్, కేఎస్ భరత్ రాకతో టెస్టుల్లో చోటు కోల్పోయాడు. 40 ఏళ్ల వృద్ధిమాన్ సాహా భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు, ఆరు అర్ధశతకాలు బాదాడు. 2021లో వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు ఆఖరిగా ప్రాతినిథ్యం వహించాడు.

''నా క్రికెట్ గొప్ప ప్రయాణంలో ఈ సీజన్ చివరిది. బెంగాల్ తరఫున చివరిసారిగా ప్రాతినిథ్యం వహించనుండటం గౌరవంగా ఉంది. ఈ రంజీ ట్రోఫీ అనంతరం వీడ్కోలు పలకున్నాను'' అని సాహా పేర్కొన్నాడు. 2007 నుంచి 2022 వరకు బెంగాల్ సాహా ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత రెండేళ్లు త్రిపుర తరఫున ఆడాడు. ఈ ఏడాది ఆగష్టులో బెంగాల్‌కు తిరిగొచ్చాడు.
ఐపీఎల్‌కూ గుడ్‌బై!
ఐపీఎల్‌కు కూడా వృద్ధిమాన్ సాహా గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి సాహా రిజిస్టర్ చేసుకోవట్లేదని సమాచారం. గుజరాత్ టైటాన్స్ సాహాను రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. కాగా, ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న సాహా గుజరాత్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.