
ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే పాకిస్తాన్‌లో మొదలైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అభిమానులు మాత్రం మరో వాదన చేస్తుంటారు. ఐపీఎల్ కన్నా పీఎస్ఎల్ బాగుంటుందని, నిజమైన క్రికెట్ అంటే తమదేనని పాకిస్తాన్ అంటుంది. అయితే చాలా మంది ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్‌కు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. తద్వారా భారీగానే సంపాదిస్తుంటారు. దీనికి తాజాగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలమే ఉదాహరణ.
గతేడాది చివర్లో ఐపీఎల్ మినీ వేలం జరిగింది. దానిలో ఏకంగా రూ.18 కోట్లు పెట్టి శామ్ కర్రాన్‌ను కొనుగోలు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. తాజాగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో కూడా ప్లేయర్లకు మంచి ధర లభించింది. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఏకంగా రూ.3.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
ఆల్‌రౌండర్లపై కూడా ఫోకస్ పెట్టిన ఫ్రాంచైజీలు యాష్లే గార్డనర్, నాట్ సివర్ వంటి వారికి కూడా మంచి ధర పలికింది. ఈ లెక్కలు చూస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ కన్నా మహిళల ప్రీమియర్ లీగ్ ఎంత పెద్దదో అర్థం అవుతుంది. స్మృతి మంధానకు దక్కిన ధరలో సగం కూడా పీఎస్ఎల్ టాప్ ప్లేయర్లకు దక్కడం లేదు. పాకిస్తాన్ జాతీయ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు పీఎస్ఎల్‌లో దక్కే మొత్తం కేవలం రూ.1.4 కోట్లు మాత్రమే. అతనొక్కడే కాదు షహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ వంటి వారికి కూడా రూ.కోటి నుంచి రూ.1.4 కోట్ల మధ్యలోనే దక్కుతుంది.