
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి డబ్ల్యూపీఎల్ (మహిళల ప్రీమియర్ లీగ్) సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మహిళా దినోత్సవం నాడు జరిగే డబ్ల్యూపీఎల్ మ్యాచుకు టికెట్లు అక్కర్లేదని, ఫ్రీగా స్టేడియంలో మ్యాచ్ చూడొచ్చని ప్రకటించింది. ఈ మేరకు డబ్ల్యూపీఎల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇది చూసిన చాలా మంది క్రికెట్ ప్రేమికులు.. డబ్ల్యూపీఎల్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు.
'ప్రత్యేకమైన రోజును ప్రత్యేకంగానే జరుపుకోవాలి. మార్చి 8న జరిగే ఆర్సీబీ, గుజరాత్ మ్యాచ్‌లో అందరికీ ఉచిత ఎంట్రీ ఏర్పాటు చేయడం ద్వారా మహిళా దినోత్సవాన్ని టాటా డబ్ల్యూపీఎల్ జరుపుకుంటోంది' అని డబ్ల్యూపీఎల్ ప్రకటించింది. ఈ టోర్నీలో జరిగే మిగతా మ్యాచుల్లో కూడా ఆడవాళ్లు, అమ్మాయిలకు టికెట్ అవసరం లేదు. వాళ్లు ఉచితంగానే స్టేడియంలో మ్యాచులు చూడొచ్చు.
అయితే పురుషులు మాత్రం రూ.వంద రూపాయలకు టికెట్లు కొనాల్సి ఉంటుంది. మహిళా దినోత్సవం రోజు మాత్రం పురుషులు కూడా టికెట్లు కొనాల్సిన అవసరం ఉండదు. అయితే ఆన్‌లైన్‌లో సీట్ల ఎవైలబులిటీని బట్టి సీట్లు దొరుకుతాయని తెలుస్తోంది.
మహిళా దినోత్సవం జరుపుకునే రోజునే హోలీ పండుగ కూడా రావడంతో ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని అంచనా. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో తలపడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు రెండూ కూడా టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఈ రెండు జట్లలో తొలి విజయం సాధించే జట్టు ఏదనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. బెంగళూరుకు టీమిండియా స్టార్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఉండగా.. గుజరాత్‌కు బెత్ మూనీ కెప్టెన్సీ చేస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో గాయపడిన ఆమె స్థానంలో టీమిండియా ప్లేయర్ స్నేహ్ రాణాకు జట్టు పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే.