WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో స్మృతి మంధాన సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆర్సీబీ బ్యాటింగ్.. రాధా యాదవ్, రిచా ఘోష్ మెరుపులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే ముగిసేసరికి కేవలం 43 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాధా యాదవ్ (66 పరుగులు, 47 బంతులు), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (44 పరుగులు, 28 బంతులు) అద్భుతమైన పోరాటాన్ని కనబరిచారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో నాడిన్ డి క్లెర్క్ (26) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్ 3 వికెట్లు పడగొట్టింది.

గుజరాత్ ఛేదన: శ్రేయాంక పాటిల్ 'పంజా'
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో 5 వికెట్లు (5/23) పడగొట్టి గుజరాత్ నడ్డి విరిచింది. గుజరాత్ జట్టులో భారతి ఫుల్మాలి (39), బెత్ మూనీ (27) మాత్రమే కాస్త పోరాడారు. ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ కూడా 3 వికెట్లతో రాణించడంతో గుజరాత్ జెయింట్స్ 18.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ హవా
ఈ భారీ విజయంతో ఆర్సీబీ 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా ఆర్సీబీ నిలిచింది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 ఓటములతో మూడో స్థానంలో ఉంది.