ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ అద్భుత విజయం సాధించగా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ నదీన్ డి క్లర్క్ తన సత్తా చాటింది. స్టేడియంలో తన ఆటతో ఆర్సీబీ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇదిలా ఉండగా.. నదీన్ డీ క్లర్క్‌కు చెందిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన ఫిట్‌నెస్ రహస్యం గురించి కీలక విషయాలను వెల్లడించింది. తన మాటలతోనూ నదీన్ డీ క్లర్క్ అందరినీ ఆకట్టుకున్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన నదీన్ డీ క్లర్క్.. డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీని గెలిపించి కొత్త స్టార్‌గా ఎదిగింది. కీలక సమయంలో మైదానంలోకి దిగి కేవలం 44 బంతుల్లోనే 63 పరుగులు సాధించింది. బౌలింగ్‌లోనూ రాణించి 4 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ బ్యాటర్లను కట్టడి చేసింది. చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరమైన తరుణంలో ఆమె వీరోచిత పోరాటం చేసి ఆర్సీబీకి 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది.

వైరల్ అయిన రొమాంటిక్ కామెంట్స్
ఓ ఇంటర్వ్యూలో నదీన్ డి క్లర్క్ తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. "ఈ రాత్రి మా భర్తతో పని చేయించుకుంటాను.. ఆయన దగ్గర నుంచి చాలా మసాజ్, మంచి రికవరీ సెషన్ ఆశిస్తున్నాను" అని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. కఠినమైన మ్యాచ్ తర్వాత విశ్రాంతి అవసరమన్న ఉద్దేశంతో ఆమె ఈ సరదా మాటలు అన్నారు. నదీన్ డీ క్లర్క్ ఈ మాట అనగానే ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వుతూ, కేకలు వేస్తూ సందడి చేశారు. ఆమె మాటల్లోని హాస్యం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.
ప్రేక్షకుల స్పందన చూసి వెంటనే ఆమె నవ్వుతూ, "మసాజ్ గైస్.. మసాజ్" అని అంటూ అందరూ కేవలం మసాజ్ గురించే ఆలోచించాలని సరదాగా స్పష్టం చేశారు. తన భర్త తనకి కేవలం భర్త మాత్రమే కాదు, తన ఫిట్‌నెస్ కోచ్ కూడా అని నదీన్ వెల్లడించారు. తన ఫిట్‌నెస్ విషయంలో, ప్రతి పనిలోనూ ఆయన తనకు అండగా ఉంటారని, తన కోసం ఆయన అన్నీ చేస్తారని గర్వంగా చెప్పుకొచ్చారు. నదీన్ డీ క్లర్క్ తన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆర్సీబీ అభిమానుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, తన వ్యక్తిత్వంతో క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్నారు. మైదానంలో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఈ క్రీడాకారిణి, మైదానం బయట ఇంత సరదాగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.