ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ల వర్షం కురిసింది. శనివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో యూపీ వారియర్స్‌పై గుజరాత్ జెయింట్స్ (GG) 10 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ చివరి వరకు పోరాడి 8 వికెట్లు కోల్పోయి 197 పరుగుల వద్దే ఆగిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే యూపీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. గుజరాత్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ కేవలం 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించారు. అనుష్క శర్మ అరంగేట్రం మ్యాచ్‌లోనే 30 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసి ఆశ్చర్యపరిచారు. సోఫీ డివైన్ మెరుపు ఆరంభాన్నిస్తూ 20 బంతుల్లోనే 38 పరుగులు జోడించారు. చివరిలో జార్జియా వేర్‌హామ్ (27), భారతి ఫుల్‌మాలీ (14) వేగంగా ఆడటంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 2.. షికా పాండే, డాటిన్ చెరో వికెట్ తీశారు.

యూపీ వారియర్స్ ఛేదన: లిచ్‌ఫీల్డ్ ఒంటరి పోరాటం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌కు ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆశలు రేకెత్తించారు. లిచ్‌ఫీల్డ్ కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ మెగ్ లానింగ్ (30), శ్వేతా షెరావత్, ఆశా శోభన రాణించినప్పటికీ.. గుజరాత్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయారు. గుజరాత్ బౌలర్లలో జార్జియా వేర్‌హామ్, సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీశారు.