WPL 2026 Final: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న ఈ తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. బయట ప్రాణ స్నేహితులైన స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది.
రెండో టైటిల్‌పై ఆర్సీబీ కన్ను
స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చిన ఈ జట్టు.. రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఆర్సీబీలో గ్రేస్ హారిస్, గౌతమి నాయక్ వంటి బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. స్మృతి మంధాన, రిచా ఘోష్ మెరుపులు మెరిపిస్తే ఆర్‌సీబీని ఆపడం కష్టమే మరి. నాదిన్ డి క్లర్క్ (15 వికెట్లు), శ్రేయాంక పాటిల్ బౌలింగ్‌లో జట్టుకు ప్రధాన బలంగా నిలిచారు.

ఢిల్లీ క్యాపిటల్స్.. మూడు ఫైనల్స్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇది నాలుగో ఫైనల్. గత మూడు సార్లు ఫైనల్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయిన ఢిల్లీ.. ఈసారి కొత్త కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ఆధ్వర్యంలో తొలి ట్రోఫీని ముద్దాడాలని ఆరాటపడుతోంది. బౌలింగ్‌లో నందిని శర్మ (16 వికెట్లు) ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ, లిజెల్ లీ, లారా వోల్వార్డ్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా క్రీడాకారుల అండ, మెరుగైన టీమ్ వర్క్ ఢిల్లీకి అదనపు బలం. ఓ వైపు ఆర్‌సీబీ చరిత్రను సమం చేయాలని చూస్తుంటే.. మరోవైపు ఢిల్లీ కొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. మరి ఈ 'స్నేహితుల యుద్ధం'లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!
తుది జట్లు (అంచనా):
ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, లిజెల్ లీ, లారా వోల్వార్డ్, మారిజన్ కాప్, అల్లానా కింగ్, తానియా భాటియా (కీపర్), చినెల్ హెన్రీ, నందిని శర్మ, స్నేహ్ రాణా, మిన్నూ మణి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), రిచా ఘోష్ (కీపర్), గ్రేస్ హారిస్, గౌతమి నాయక్, శ్రేయాంక పాటిల్, నాదిన్ డి క్లర్క్, జార్జియా వోల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, సయాలీ సత్ఘరే, లారెన్ బెల్.