WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన ముంబై.. ఈ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
హర్మన్-సీవర్ బ్రంట్ విధ్వంసం
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(42 బంతుల్లో 74 పరుగులు), నాట్ సీవర్-బ్రంట్(46 బంతుల్లో 70 రన్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. హర్మన్‌ప్రీత్ తన అద్భుత ప్రదర్శనకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకుంది.

కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందు నుంచే తడబడింది. చిన్లే హెన్రీ (56 పరుగులు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు ఎవరూ అండగా నిలవలేదు. ఫలితంగా ఢిల్లీ జట్టు 145 పరుగులకే ఆలౌట్ అయి, టోర్నీ చరిత్రలోనే తమ భారీ ఓటమిని మూటగట్టుకుంది.
గెలుపు రహస్యాన్ని విప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్
విజయం అనంతరం ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. తమ మైండ్‌సెట్ మార్పులే గెలుపుకు కారణమని చెప్పింది. "నిన్నటి ఓటమి మమ్మల్ని నిరాశకు గురిచేసింది. కానీ ఈరోజు మరింత దృఢమైన సంకల్పంతో బరిలోకి దిగాం. నిన్నటి మ్యాచ్‌లో నాకు మంచి ఆరంభం లభించినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాను. అందుకే ఈరోజు బ్యాటింగ్‌కు వెళ్లేముందు 'గతాన్ని మర్చిపో, ఇది కొత్త రోజు.. కొత్త ఇన్నింగ్స్' అని నా మనసుకి చెప్పుకున్నాను. ప్లాన్‌ను సరిగ్గా అమలు చేయడం వల్లే గెలిచాం" అని హర్మన్ వివరించింది.
ఓటమికి కారణం అదే: జెమిమా రోడ్రిగ్స్
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ తమ ఓటమిపై స్పందిస్తూ భాగస్వామ్యాల లేమిని ప్రధాన కారణంగా పేర్కొంది."బౌలింగ్‌లో మేము పర్వాలేదనిపించాం, లక్ష్యం కూడా ఛేదించదగిందే. కానీ బ్యాటింగ్‌లో కనీస భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయాం. బ్యాటర్ల మధ్య సమన్వయం లోపించడం వల్లే వికెట్లు కోల్పోయాం. ఈ తప్పుల నుంచి నేర్చుకుని తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకుంటాం" అని జెమిమా ఆశాభావం వ్యక్తం చేసింది.