ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో), సోఫీ డివైన్ (32; 27 బంతుల్లో), స్మృతి మంధాన (31; 39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్. అయితే ఓ దశలో 64/0తో టాప్‌లో నిలిచిన ఢిల్లీ ఆ తర్వాత 49 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. మెగ్ లానింగ్ (23; 23 బంతుల్లో) నిలకడగా ఆడటంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 61 పరుగులు చేసింది. సోఫీ మొలినెక్స్ వేసిన 8వ ఓవర్‌తో ఢిల్లీ కథ మారిపోయింది.

ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడింది. పాయింట్ల టేబుల్‌లో టాపర్‌గా నిలిచిన తమ జట్టు ఫైనల్లో ఓటమికి గల కారణాలను వివరించింది. అలాగే విజేతగా నిలిచిన ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపింది. ''ట్రోఫీని చేజార్చుకున్నందుకు ఎంతో నిరాశగా ఉంది. ఆ రోజు ఎలా ఆడామనే దానిపైనే ఫైనల్స్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీకి కంగ్రాట్స్. మాపై వాళ్లు పైచేయి సాధించారు. ఈ టోర్నమెంట్‌లో క్రేజీ సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి''
''ఆర్సీబీ టీమ్‌కే క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు గొప్పగా పోరాడి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. విజేతగా నిలవడానికి వాళ్లు అర్హులు. అయితే మేం ఎంతో ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితం రాలేదు. మా జట్టు పోరాటం వెనుక ఎంతోమంది కృషి దాగి ఉంది. మా సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. క్రికెట్ ఓ ఫన్నీ గేమ్.. కొన్నిసార్లు మీరు గెలుస్తారు, మరికొన్నిసార్లు ఓడిపోతారు'' అని మెగ్ లానింగ్ పేర్కొంది.