ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఆరంభం అదిరింది. ఢిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ఘనంగా బోణీ కొట్టింది. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో విజయం సాధింది. నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఆఖరి బంతికి సిక్సర్ సాధించి గెలిచింది. భారత ప్లేయర్ సజన (6*; 1 బాల్) బంతిని స్టాండ్స్‌కు తరలించి ముంబయికి చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సె (75; 53 బంతుల్లో), జెమిమా రోడ్రిగ్స్ (42; 24 బంతుల్లో) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వికెట్ కీపర్ యస్తిక భాటియా (57; 45 బంతుల్లో), హర్మన్‌ప్రీత్ కౌర్ (55; 34 బంతుల్లో) అర్ధశతకాలతో అదరగొట్టారు.

ఛేదనలో ముంబయి ఇండియన్స్‌కు పేలవారంభం దక్కింది. ఎదుర్కొన్న రెండో బంతికే ఓపెనర్ హేలీ మాథ్యూస్ (డకౌట్) వెనుదిరిగింది. కానీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నాట్ స్కీవర్ (19; 17 బంతుల్లో)తో కలిసి మరో ఓపెనర్ యస్తికా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అయితే నాట్ స్కీవర్‌ను అరుంధతి ఔట్ చేయడంతో వీరిద్దరి 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి యస్తికా లక్ష్యాన్ని కరిగించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా దూకుడుగా ఆడటంతో ముంబయి ఛేదన సజావుగా సాగింది. కానీ యస్తికాను ఔట్ చేసి ఢిల్లీ తిరిగి పోటీలోకి వచ్చింది. మరోవైపు అమెలియా కెర్ (24; 18 బంతుల్లో) బ్యాటు ఝుళిపించడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది.
ముంబయి విజయానికి చివరి ఆరు బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. బంతి అందుకున్న అలైస్ తొలి బంతికి పూజ (1; 3 బంతుల్లో) వికెట్ తీసింది. కానీ హర్నన్‌ప్రీత్ కౌర్ నాలుగో బంతికి బౌండరీ బాదడంతో విన్నింగ్ ఈక్వేషన్ ఆఖరి రెండు బంతుల్లో అయిదు పరుగులగా మారింది. అయితే అయిదో బంతికి హర్మన్‌ప్రీత్ ఔటయ్యింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సజన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది ముంబయిని గెలిపించింది. ఢిల్లీ బౌలర్లలో అరుంధతి, అలైస్ తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సె (75; 53 బంతుల్లో) అర్ధశతకంతో విజృంభించింది. జెమిమా రోడ్రిగ్స్ (42; 24 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ (1; 8 బంతుల్లో) షబ్నిమ్ ఇస్మాయిల్ స్టన్నింగ్ డెలివరితో క్లీన్ బౌల్డ్ చేసింది.
కానీ, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అలైస్ క్యాప్సె ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చింది. 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో సత్తాచాటింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (31; 25 బంతుల్లో)తో కలిసి రెండో వికెట్‌కు అర్ధశతక (64 రన్స్) భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అనంతరం మెగ్ లానింగ్ ఔటైన తర్వాత జెమిమా క్రీజులోకి వచ్చింది. జెమిమా దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ ఆఖర్లో వీరిద్దరు ఔటయ్యారు. మారిజానే (16; 9 బంతుల్లో) బ్యాటు ఝుళిపించడంతో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీకి 24 పరుగులు వచ్చాయి. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో నాట్ స్కివర్, అమెలియా చెరో రెండు వికెట్లు, షబ్నిమ్ ఒక్క వికెట్ తీశారు.