ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా బోణీ కొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తాచాటింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేసింది. రిచా ఘోష్ (62; 37 బంతుల్లో), తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన (53; 44 బంతుల్లో) అర్ధశతకాలతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 155 పరుగులకు పరిమితమైంది.
యూపీ వారియర్స్ ఛేదనను పేలవంగా ఆరంభించింది. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలిసా హీలీ (5; 4 బంతుల్లో), వ్రిందా దినేశ్ (18; 28 బంతుల్లో), తాహిలా (22; 18 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రేస్ హారిస్ (38; 23 బంతుల్లో), శ్వేత (31; 25 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కానీ ఆ తర్వాత బెంగళూరు బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు. ఆఖర్లో పూనమ్ (14; 7 బంతుల్లో), దీప్తి శర్మ (13*; 9 బంతుల్లో) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. చివరి రెండు బంతుల్లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమవ్వగా దీప్తి వరుసగా ఫోర్, రెండు పరుగులు మాత్రమే సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో శోభన అయిదు వికెట్లతో సత్తాచాటింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సోఫి డివైన్ (1; 5 బంతుల్లో) నిరాశపరచగా, కెప్టెన్ స్మృతి మంధాన (13; 11 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. కాసేపటికే స్టార్ ప్లేయర్ ఎలిస్ పెర్రీ (8; 7 బంతుల్లో) కూడా ఔటైంది. దీంతో 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. కానీ మేఘనతో కలిసి రిచా ఘోష్ ఇన్నింగ్స్ చక్కదిద్దింది.
మేఘన సంయమనంతో ఆడితే రిచా ఘోష్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. వీరిద్దరు నిలకడగా పరుగులు చేస్తూ నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. కానీ గేర్ మార్చి దూకుడుగా ఆడే యత్నంలో మేఘన.. రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో స్టంపౌటైంది. రాజేశ్వరి అదే ఓవర్‌లో జార్జియా (0; 3 బంతుల్లో)ను కూడా ఔట్ చేసి బెంగళూరును దెబ్బకొట్టింది. కానీ ఆ తర్వాత రిచా ఘోష్ చెలరేగింది. వరుస బౌండరీలతో హోరెత్తించింది. ఈ క్రమంలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుంది. 18వ ఓవర్ వేసిన తాహిలా మెకాగ్రత్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాది 15 పరుగులు పిండుకుంది.