ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన రెండింట్లో గెలిచి నాలుగు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫన్నీ మూమెంట్ చోటు చేసుకుంది.
మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఓ అభిమాని ఆర్సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్‌కు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఫ్లకార్డుపై 'విల్ యూ మ్యారీ మీ శ్రేయాంక పాటిల్' అంటూ సదరు అభిమాని రాసుకొచ్చాడు. దాన్ని గమనించిన కెమెరా సిబ్బంది ఫోకస్ చేస్తూ స్క్రీన్‌పై కనిపించేలా చేశారు. ఇది చూసి డగౌట్‌లో కూర్చున్న ఆర్సీబీ అమ్మాయిలు నవ్వుకున్నారు. శ్రేయాంక మాత్రం రియాక్ట్ కాలేదు. ఈ సంఘటన ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో చోటు చేసుకుంది.

బెంగళూరుకు చెందిన బౌలింగ్ ఆల్‌రౌండర్ శ్రేయాంక ఇటీవలే టీమిండియాలో అడుగుపెట్టింది. గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఆస్ట్రేలియాతో వన్డే, ఇంగ్లండ్‌తో టీ20 ఫార్మాట్‌లో తొలి మ్యాచ్ ఆడింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులే చేసింది. దయాలన్ హేమలత(31*, 25 బంతుల్లో ), హర్లీన్ డియోల్(22; 31 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో సోఫీ మోలినక్స్(3/25) మూడు వికెట్లు, రేణుక సింగ్(2/14) రెండు , జార్జియో వేర్‌హమ్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. స్మృతి మంధాన (43; 27 బంతుల్లో) మెరుపు బ్యాటింగ్‌తో 12.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. గుజరాత్ బౌలర్లలో అష్లే గార్డెనర్, తనూజ కాన్వేర్‌ల తలో వికెట్ దక్కింది. కెప్టెన్ స్మృతి మంధాన ఎదుర్కొన్న తొలి 4 బంతుల్లో మూడు బౌండరీలు బాదింది. సోఫీ డివైన్(6) విఫలమైనా.. సబ్బినేని మేఘన (36; 28 బంతుల్లో)తో కలిసి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడింది.
హాఫ్ సెంచరీకి చేరువైన స్మృతి మంధానను తనూజ కాన్వేర్ రిటర్న్ క్యాచ్‌తో బోల్తా కొట్టింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఎల్లిస్ పెర్రీ(23; 14 బంతుల్లో)తో కలిసి మేఘన విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.