ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ వరుస విజయాలతో హోరెత్తిస్తుంది. ప్రారంభ మ్యాచ్‌లో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ముంబయి ఇవాళ గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో ముంబయి అయిదు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే విజయం సాధించింది.
అయితే ముంబయి ఇండియన్స్ సునాయాసంగా నెగ్గలేదు. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. యస్తికా భాటియా (7; 7 బంతుల్లో), హేలీ మాథ్యూస్ (7; 11 బంతుల్లో), నాట్ స్కీవర్ (22; 18 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అమెలియా కెర్ (31; 25 బంతుల్లో) కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (46*; 41 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

గుజరాత్ బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలోనే అమెలియా, పూజ (1; 2 బంతుల్లో)ను ఔట్ చేశారు. అప్పటికే ముంబయి విజయానికి చేరువలో ఉంది. హర్మన్‌ప్రీత్ సిక్సర్‌తో జట్టును గెలిపించింది. తనుజ రెండు వికెట్లు, కాథ్రిన్, లీ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 78 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. వేదా (0), హర్లీన్ (8), లిచ్‌ఫీల్డ్ (7), హేమలత (3), కెప్టెన్ మూనీ (24), గార్డెనర్ (15), స్నేహా (0) వరుసగా పెవిలియన్‌కు చేరారు. కానీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుజా (28; 21 బంతుల్లో)తో కలిసి కాథ్రిన్ (25; 24 బంతుల్లో) జట్టును ఆదుకుంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 48 పరుగులు సాధించారు. అమెలియా నాలుగు వికెట్లు, షబ్నిమ్ మూడు, నాట్ స్కీవర్, హేలీ చెరో వికెట్ తీశారు.