ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2024లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన గుజరాత్ బుధవారం తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
గుజరాత్ ఓపెనర్లు వోల్వార్ట్ (76; 45 బంతుల్లో), బెత్ మూనీ (85; 51 బంతుల్లో) విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్‌కు 13 ఓవర్లలోనే 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆది నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్‌ప్లేలో 59 పరుగులు జోడించారు. ఓపెనర్ల ధాటికి గుజరాత్ 200 మార్క్‌ను సులభంగా దాటేలా కనిపించింది. కానీ ఆఖరి రెండు ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. చివరి పది బంతుల్లో నాలుగు పరుగులే చేసింది.

అనంతరం ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లు నలుగురు రనౌటవ్వడం గమనార్హం. ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. కుదురుకున్నట్లుగా కనిపించిన స్మృతి మంధాన (24; 16 బంతుల్లో) ఆదిలోనే ఔటైంది. మరో ఓపెనర్ సబ్బినేని మేఘన (4; 13 బంతుల్లో) చాలా నిదానంగా ఆడింది. దీంతో బెంగళూరు ఏడు ఓవర్లకు 42 పరుగులే చేసింది.
అయితే జార్జియా వేర్‌హామ్ (48; 22 బంతుల్లో), రిచా ఘోష్ (30; 21 బంతుల్లో) దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. కానీ గుజరాత్ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీస్తూ బెంగళూరుపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో యూపీ వారియర్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.