
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మొదలైనప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంత మందిని ఉర్రూతలూగించిందో తెలిసిందే. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ తొలి మ్యాచ్ నుంచే అభిమానులకు ఫేవరెట్‌గా మారింది. ఈ క్రమంలోనే చాలా మంది ఈ లీగ్‌కు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఐపీఎల్ నిర్వాహకులు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏళ్లు గడిచేకొద్దీ ఐపీఎల్ రేంజ్ పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడు మిగతా లీగ్‌లకు అందనంత ఎత్తులో నిలిచింది.
ఐపీఎల్ మొదలైన ఇన్నేళ్ల తర్వాత మహిళలకు కూడా ఒక లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ తలచుకుంటే జరగనిది ఏముంటుంది? దీంతో వెంట వెంటనే అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)పై కూడా అభిమానుల ఆసక్తి పెరిగింది. వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఆ తర్వాత కొన్ని రోజులకే డబ్ల్యూపీఎల్ మొదలైంది. దీనిలో కూడా తొలి మ్యాచ్ అద్భుతంగా జరిగింది.
అచ్చం ఐపీఎల్‌లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన డబ్ల్యూపీఎల్.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్‌లో యూపీ వారియర్జ్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరుకుంది. తన ప్రత్యర్థి కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఢిల్లీ సారధి మెగ్ లానింగ్ ఈ లీగ్ అంతా అద్భుతంగా రాణించి తమ జట్టును ఫైనల్ చేర్చింది.
ఇక్కడే ఒక ఆసక్తికర విషయం గమనించాల్సి ఉంది. 2008లో తొలి ఐపీఎల్ ఫైనల్ చేరిన జట్లు ఏవో గుర్తుందా? రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్. వీటిలో చెన్నైకి అప్పటి టీమిండియా కెప్టెన్ ధోనీ సారధ్యం వహిస్తుండగా.. రాజస్థాన్‌కు ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో కూడా ముంబైకి భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉండగా.. ఢిల్లీకి ఆసీస్ సారధి మెగ్ లానింగ్ సారధ్యం వహిస్తోంది. మరి అప్పట్లో షేన్ వార్న్ గెలిచినట్లే.. లానింగ్ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లేక హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర తిరగరాస్తుందా? చూడాలి.