హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్‌లో తనకంటూ కొన్ని పేజీలను లిఖించిన మాజీ పేసర్ బ్రెట్ లీకి భారత్ అంటే ఎంతో అభిమానం. తన ఇనిస్టాగ్రామ్‌లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలతో కూడిన ఫోటోలను గతంలో కూడా పలుమార్లు పోస్టు చేశాడు.
అంతేకాదు భారత్‌లోని అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బ్రెట్‌లీ జీవితంపై సినిమా తీసే విషయమై ఒప్పించడానికి చాలా విఫల ప్రయత్నాలే చేశారు. అయితే బ్రెట్ లీ మాత్రం ఇందుకు అంగీకరించలేదు.
'సినిమాలో ఏం చూపిస్తారు? మహా అయితే నా వ్యక్తిత్వం, సాధించిన విజయాల గురించి గొప్పగా చెబుతారు. దీనివల్ల ఎవరికి లాభం? నా ఒక్కడికే. ఇది నాకిష్టం లేదు. నా పేరు నలుగురికీ ఉపయోగపడే విధంగా ఉంటే నేను దేనికైనా సిద్ధం' అని ఇటీవలే ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

కాగా, బ్రెట్ లీ తన జీవితంపై తీసే సినిమా తీసేందుకు అభ్యంతరం తెలపడానికి ఓ కారణం ఉంది. కొన్నాళ్ల కిందట బ్రెట్‌లీ కొడుకు ప్రెస్టన్‌కి పాక్షిక వినికిడిలోపం ఏర్పడింది. తనకి ఎంత పేరు ప్రఖ్యాతులున్నా తన కుమారుడికి వచ్చిన సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయాననే బాధ ఉంది.
దాంతో అప్పట్నుంచే తన పేరును మంచికే ఉపయోగిస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే నెలలో బ్రెట్ లీ భారత పర్యటనకు రానున్నాడు.