హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో జరిగే కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నట్లు టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా స్పష్టం చేశాడు. ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఛటేశ్వర్ పుజారాను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయని సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నాటింగ్ హామ్ తరపున పుజారా ఆడుతున్నాడు. చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పుజారా దీనిపై తాజాగా స్పందించాడు.

ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడటాన్ని తాను ఎక్కువగా ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నాడు. 'నాటింగ్ హామ్‌తో జత కట్టడం సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లోని ఛాలెంజింగ్ కండిషన్లలో ఆడటాన్ని బాగా ఆస్వాదించా. అక్కడ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం భిన్నమైన అనుభవం' అని పుజారా తెలిపాడు.
'భారత్‌లోని పరిస్థితులతో పోలిస్తే ఇంగ్లాండ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడి ఫాస్ట్ పిచ్‌లపై పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంది. నాటింగ్ హామ్ జట్టులో పరుగులు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మరోసారి ఛాన్స్ వస్తే ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడాలని ఉంది' అని పుజారా అన్నాడు.
నాటింగ్ హామ్‌కు ఆడే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్టువర్ట్ బ్రాడ్, సమిత్ పటేల్‌తో కొంత సమయాన్ని గడిపానని పుజారా వెల్లడించాడు. ఇంగ్లాండ్ మాజీ కోచ్ పీటర్ మూర్స్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పుజారా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో ఇంగ్లీషు కౌంటీల్లో పుజారా మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లాడి 233 పరుగులు చేశాడు. గతంలో యార్క్ షైర్, డెర్బీ షైర్‌కి ఆడిన పుజారా ప్రస్తుత సీజన్‌లో నాటింగ్ హామ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇదిలా ఉంటే జులై నెలాఖరున టీమిండియా లంక పర్యటనకు వెళ్లనుంది.
ఈ క్రమంలో శ్రీలంక పర్యటకు వెళ్లే టెస్టు జట్టులో పుజారా చోటు దక్కించుకునే అవకాశం ఉంది.