హైదరాబాద్: భారత్ క్రికెట్‌కు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి బుధవారం తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు.
మహేంద్ర సింగ్ ధోని ఫోటో గ్యాలరీ
వన్డే, టీ20ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంపై సునీల్ గవాస్కర్ సంతోషం వ్యక్తం చేశాడు. అలా కాకుండా పూర్తిగా క్రికెట్‌కు దూరమై ఉండే జార్ఖండ్‌లోని ధోని ఇంటి ముందు భారీ ధర్నా చేసేవాడినని చమత్కరించాడు. భారత క్రికెట్‌కు ధోని ఇంకా తన సేవల్ని అందించగలడని తెలిపాడు.
ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై గవాస్కర్ మాట్లాడాడు. 'ఒకవేళ అతడు (ధోని) ఆటగాడిగా వైదొలగి ఉంటే తిరిగి జట్టులోకి రావాలని అతడి ఇంటి ముందు ధర్నా చేసే తొలి వ్యక్తిని నేనే అవుతా. ప్లేయర్‌గా అతడొక విధ్వంసకుడు. ఒక్క ఓవర్‌లో మ్యాచ్ దిశను మార్చివేయగలడు. ఒక ఆటగాడిగా భారత్‌కు అతడి సేవలు చాలా చాలా అవసరం. జట్టు సభ్యుడిగా కొనసాగుతానని అతడు నిర్ణయం తీసుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను' అని గవాస్కర్ అన్నాడు.
వన్డే, టీ20ల నుంచి ధోని తన కెప్టెన్సీని వదులుకోవడం తనని ఆశ్చర్యానికి గురి చేయలేదని చెప్పాడు. అయితే ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటాడని తాను ఊహించలేదని పేర్కొన్నాడు. 'అవును. ధోనిని కోహ్లీ నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు దింపొచ్చు. ఫినిషర్‌గా జట్టుకు భారీ ఇన్నింగ్స్‌లు అందించగలడు' అని గవాస్కర్ అన్నాడు.

ఇక కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడం వల్ల ధోని బ్యాటింగ్, కీపింగ్‌లో మరింతగా రాణించగలడని విశ్వాసాన్ని గవాస్కర్ వ్యక్తం చేశాడు. టీమిండియా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌కు ముందే బాధ్యతల నుంచి ధోని వైదొలిగాడని గవాస్కర్ పేర్కొన్నాడు.
అయితే 2014లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరిస్ జరుగుతున్న సమయంలో టెస్టులకు వీడ్కోలు పలికిన సందర్భాన్ని గవాస్కర్ గుర్తు చేశారు. అప్పటి ధోని నిర్ణయం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చాడు. వన్డే, టీ20ల్లో ధోనికి ఉన్న అనుభవం కోహ్లీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు.
ఇక ధోని 2019 వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతాడా? అన్న ప్రశ్నకు గాను అది ధోని కోరిక, ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. చివరగా ధోని ఇంకా కొన్ని రోజులు భారత క్రికెట్‌కు సేవలు అందించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.