హైదరాబాద్: పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయకపోవడమే తమ ఓటమికి కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేనను కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ ఓడించిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'మా ఓటమికి పూర్తి స్థాయి బ్యాటింగ్ చేయకపోవడమే ప్రధాన కారణం. ఇంకా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి ఉంటే మరిన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచగలిగే వాళ్లం. చివరి 13 నుంచి 14 ఓవర్ల పాటు మా బ్యాటింగ్ బాగుంది. కానీ మేము అనుకున్న దానికంటే 20-30 పరుగులు తక్కువే చేశాం' అని కోహ్లీ అన్నాడు.
'మేము లక్ష్యాన్ని నిర్దేశించిన దానికి మరో 40 పరుగులు అదనంగా చేయాల్సింది. మా టాపార్డర్ విఫలం కావడం వల్ల అనుకున్న పరుగుల్ని సాధించలేకపోయాం. ఇదే మా ఓటమిపై ప్రభావం చూపింది' అని కోహ్లీ అన్నాడు. ఇక, ముంబై వన్డేలో రెండొంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సిన టామ్ లాథమ్-రాస్ టేలర్‌ల జోడీపై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.

ముంబై స్టేడియంలో 275 పరుగులు మంచి స్కోరు అనుకున్నప్పటికీ, దాన్ని లాథమ్-టేలర్ సమర్ధవంతంగా చేధించగలిగారని కోహ్లీ అన్నాడు. తమకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారని అన్నాడు. కచ్చితంగా న్యూజిలాండ్ గెలుపు వారిద్దరిదే అనడంలో ఎటువంటి సందేహం లేదని కోహ్లీ అన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ (125 బంతుల్లో 121; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన కెరీర్‌లో 31వ సెంచరీతో చెలరేగాడు. అనంతరం భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

దీంతో మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించడం విశేషం. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో లాథమ్ (102 బంతుల్లో 103 నాటౌట్: 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 95: 8 ఫోర్లు) పరుగులతో రాణించారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. చివర్లో ఒక్క పరుగు అవసరమైన సమయంలో రాస్ టేలర్ అవుట్ కావడంతో క్రీజులోకొచ్చిన నికోల్స్ ఫోర్‌తో కివీస్‌కు విజయాన్నందించాడు.