
ముంబై: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న కాలం భారత క్రికెట్‌లో అత్యంత చెత్త సమయం అని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చాపెల్‌పై సోషల్ మీడియా వేదికగా భజ్జీ చురకలు అంటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో.. ఆటగాళ్లు అందరూ ఇళ్లకే పరిమితమై సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై గ్రేగ్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తను చూసిన పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ ధోనీనే అని పేర్కొన్నాడు. ధోనీకి గతంలో బ్యాటింగ్‌పై సలహాలు ఇచ్చినట్లు కూడా తెలిపాడు. ధోనీ కెరీర్ ఆరంభంలో ప్రతి బంతిని బాదేవాడని.. అందుకే సమయోచితంగా బ్యాటింగ్ చేయమని సూచించా అని చాపెల్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అతనిపై భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
'గ్రేగ్ చాపెల్ కోచ్‌గా మారాక అందరినీ మైదానం నుంచి వెళ్లగొట్టేశాడు. అందుకే ధోనీని బంతి గ్రౌండ్ లోపలే పడే విధంగా కొట్టమని సూచించేవాడు. చాపెల్ ఆటగాళ్ల జీవితాలతో ఆటలాడుకునేవాడు' అని హర్భజన్ ట్వీట్ చేస్తూ.. 'వరస్ట్ డేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. చాపెల్ 2005 నుంచి 2007 వరకు భారత కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో విభేదించాడు. ముఖ్యంగా అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీతో గొడవలు జరిగాయి. ఇక ఇర్ఫాన్ పఠాన్ కెరీర్‌ను నాశనం చేసాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
బ్యాట్స్‌మెన్ అనుకూల నిబంధనలపై హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. సమకాలీన క్రికెట్‌లో 350 పైచిలుకు పరుగులు సాధిస్తున్నారని, వాటిని ఈజీగా ఛేదిస్తున్నారని పేర్కొన్నాడు. బంతికి, బ్యాట్‌కు మధ్య సమాతూకం లేనివి చెత్త నిబంధనలని భజ్జీ వ్యాఖ్యానించాడు. చాలాకాలంగా టీమిండియా సెలెక్షన్‌కు దూరంగా ఉంటున్న భజ్జీ.. భారత్ తరపున 103 టెస్టులు ఆడి 417 వికెట్లు తీశాడు. ఇక 236 వన్డేల్లో 269, 28 టీ20ల్లో 25 వికెట్లు తీసాడు.