కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇటు బ్యాటింగ్‌లోనూ అటు బౌలింగ్‌లోనూ సత్తా చాటిన టీమిండియా 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్(98 నాటౌట్, 57 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లనష్టానికి 185 పరుగుల భారీస్కోరు సాధించింది.
రోహిత్ ధీటైన ఆరంభం: సెంచరీ మిస్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ ధీటైన ఆరంభాన్నిచ్చాడు. సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిన రోహిత్ ఈడెన్‌లో విండీస్ బౌలింగ్‌నూ ఉతికారేశాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ మైదానంలోని ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. 94 పరుగులతో చివరి ఓవర్ నాలుగో బంతికి స్ట్రెకింగ్‌కు వచ్చిన రోహిత్ సెంచరీ పూర్తి చేసేలా కనిపించాడు.

చివరి ఓవర్ నాలుగో బంతిని బౌండరీకి తరలించి 98 రన్స్‌కు చేరిన రోహిత్ చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. టీమ్ ఇండియా మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (21) వేగంగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 32 పరుగుల వద్ద తొలివికెట్‌గా వెనుదిరిగాడు.
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే 7 పరుగులు చేసి స్పిన్నర్ బెన్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడేక్రమంలో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 8.2 ఓవర్లలో 56 పరుగులు మాత్రమే. ఈ దశలో జోరుగా ఆడుతున్న రోహిత్‌కు యువరాజ్ జత కలవడంతో పరుగుల వరద పోటెత్తింది. 27 బంతుల్లోనే 3 బౌండరీలు, సిక్సర్ బాదిన యువరాజ్ వేగంగా 31పరుగులు రాబట్టాడు.

మూడోవికెట్‌కు రోహిత్‌తో కలిసి 99 పరుగులు జోడించి భారత్ భారీస్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అనంతరం వేగంగా ఆడే క్రమంలో జడేజా(10), పవన్ నేగి(8), పాండ్యా(1) ఔటైనా భారత్ స్కోరుబోర్డు వేగంగా ముందుకుసాగింది. రైనా 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ ధోనీ, కోహ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. లోయరార్డర్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు బ్యాటింగ్ చేయలేదు.
భారీలక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు ఓపెనర్లు జాన్సన్ చార్లెస్ (18), క్రిస్‌గేల్ (20) తొలివికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్నిచ్చారు. సిన్నర్ అశ్విన్‌తో తొలి ఓవర్ బౌలింగ్ చేయించగా ఆ ఓవర్లో 14 పరుగులు, హర్భజన్ వేసిన 2 ఓవర్లో 12 పరుగులు చేయడంతో కెప్టెన్ ధోనీ పేసర్లు షమి, బుమ్రాలను రంగంలోకి దించాడు. రాకెట్ వేగంతో పరుగులు చేస్తున్న గేల్‌ను బుమ్రా తెలివైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేయడంతో కరీబియన్లు కంగారు పడ్డారు.

వరుసగా చార్లెస్, రామ్‌దిన్(6), శామ్యూల్స్ (17), డారెన్ బ్రావో(13), రస్సెల్(19) ఇలా వరుసగా వికెట్లను కోల్పోవడంతో 19.2 ఓవర్లలో 140 పరుగులకే అలౌటైంది. దీంతో 45 పరుగులు తేడాతో విండీస్ ఓటమిపాలైంది.