న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరిగిన వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ అంత బాలేదని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. నోబాల్స్, మంచు ప్రభావం వల్ల భారత్ కు నష్టం జరిగినా, అశ్విన్‌చేత మిగిలిన రెండు ఓవర్లూ బౌల్ చేయించకుండా ధోనీ తప్పుచేశాడని అన్నాడు.
క్రిక్‌బజ్‌కు రాసిన వ్యాసంలో సెహ్వాగ్ ఈ మేరకు పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో ధోనీ ప్రణాళిక సరిగా లేదని, అందువల్లే ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని సెహ్వాగ్ తెలిపాడు.

'ధోనీ మంచి కెప్టెన్. అతనికి మంచి బ్యాటింగ్ నైపుణ్యం కూడా ఉంది. అతను ఎన్నో మ్యాచులు గెలిపించాడు. అయితే, టీ20 ప్రపంచ కప్ సెమీస్ ఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో అశ్విన్‌తో మరిన్ని ఓవర్లు వేయించి ఉండాల్సింది. అలా ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ఇండియాలో జరిగే మ్యాచుల్లో ధోనీ కెప్టెన్సీ బాగుండటం లేదని సెహ్వాగ్ తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్ పరంగా బాగానే రాణించినా.. బౌలర్లు శక్తి మేరకు రాణించకపోవడం, నోబాల్స్ వేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.