మొహాలీ: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన బంగ్లాదేశ్‌పై మ్యాచును గెలిపించిన కెప్టెన్ ధోనీనీ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ పొగిడేశాడు. తమ సామర్థ్యం మేరకు ఆడితే ఆస్ట్రేలియాపై ఆదివారంనాటి మ్యాచులో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
ఆదివారం ఆస్ట్రేలియతో జరిగే కీలక మ్యాచుకు ముందు ఆయన శనివారం మీడియాతో మాట్లాడాడు. ఆసీస్ బలమైన జట్టు అని, కంగారూలు దూకుడుగా ఆడుతారని, అదే తరహాలో తాను ఆడుతాననే నమ్మకం ఉందని, సవాల్‌ను ఎదుర్కోవడానికి తాను ఇష్టపడుతానని చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడని ఆయన ప్రశంసించాడు. ధోనీలో అతి గొప్ప తెలివి, గుణం అవేనని ఆయన అన్నాడు. టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణించడం కష్టమని చెప్పాడు. ఈ ఫార్మాట్‌లో పూర్తిగా దృష్టి పెట్టి ఆడటం చాలా అవసరమని అన్నాడు.
మైదానంలో అడుగు పెట్టే సమయంలో తాను ఒత్తిడికి గురి కాకుండా దాన్ని ఓ అవకాశంగా భావిస్తానని చెప్పాడు. ప్రత్యర్థి జట్టును చూసి భయపడకుండా సవాల్‌గా తీసుకోవాలని అన్నాడు. ప్రపంచ కప్‌లో సెమీస్, ఫైనల్ మ్యాచులు గెలిస్తే మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు.

బంగ్లాదేశ్‌పై మ్యాచులో రహ్మాన్‌ను అవుట్ చేయడంలో ధోనీ చాలా తెలివిగా వ్యవహరించాడని ఆయన అన్నాడు. ఎన్నో పెద్ద మ్యాచులకు ధోనీ నాయకత్వం వహించాడని, ఎన్నో పెద్ద ఆటలను ఫినిష్ చేశాడని అన్నాడు. కొద్ది మంది అతిగా ఉద్వేగానికి గురవుతున్నప్పుడు ధోనీలా ప్రశాంతంగా ఉండేవాళ్లు ఇద్దరో ముగ్గురో ఉండాలని అన్నాడు. ఆశిష్ నెహ్రా ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు.
బంతిని ధోనీ విసిరేయకుండా పరుగెత్తుకొచ్చి వికెట్లను పడగొట్టే విషయంలో ధోనీ తెలివిగా వ్యవహరించాడని అన్నాడు. వికెట్లకు, ధోనీకి ఎంత దూరం ఉందో తాను దూరంగా ఉండడం వల్ల చూడలేకపోయానని అన్నాడు. అది చాలా రిస్క్‌తో కూడిందని, ఆ రిస్క్‌ను ప్రశాంతంగా తీసుకున్నాడని అన్నాడు.