ముంబై: వెస్టిండీస్ చేతిలో సెమీస్ మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా ప్రపంచ టీ20 టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఓటమితో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశ నిస్పృహకు గురయ్యారని భావించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారికిగా అండగా నిలబడ్డాడు.
టీమిండియా ఆటగాళ్లెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని.. జట్టు ఆటగాళ్లు టోర్నీలో అద్భుతంగానే రాణించారని అన్నాడు. టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా గెలుస్తుందని అభిమానులందరూ భావించినప్పటికీ.. విండీస్ అద్భుత ఆటతీరుతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.

సెమీస్ ఓటమితో టీమిండియా అభిమానులతోపాటు ఆటగాళ్లు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. 'అదృష్టం కష్టమైంది బాయ్స్. ఇదొక మంచి మ్యాచ్. బాగా పోరాడారు. ఫైనల్ మ్యాచులో తలపడే వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లకు శుభాకాంక్షలు' అని సచిన్ ట్వీట్ చేశాడు.
భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. టీమిండియా బాగా ఆడిందని, వారి పోరాటం గర్వకారణమని చెప్పాడు. ప్రారంభం నుంచి గొప్పగా ఆడారని ప్రశంసించాడు. వెస్టిండీస్-ఇండియా మధ్య మ్యాచ్ చాలా గొప్పగా సాగిందని, ఇప్పటి వరకు ఇలాంటి మ్యాచ్ చూడలేదని చెప్పాడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లేన్ మెక్‌గ్రాత్.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వా మాట్లాడుతూ.. మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోవాలని అన్నాడు. అద్భుతంగా మ్యాచ్ సాగిందని తెలిపాడు. రెండు గొప్ప జట్లు తలపడ్డాయని, గొప్పగా పోరాడాయని చెప్పాడు. భారీ ప్రేమ సమూహం మధ్య మ్యాచ్ సాగిందని తెలిపాడు.