న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియాకప్ సందర్భంగా షాట్లు ఆడేటప్పుడు ధోని బ్యాట్ నుంచి వచ్చిన శబ్దం అతడి సానుకూల దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని, ప్రపంచకప్‌లో ఇది భారత్‌కు శుభసూచకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు.
పేలవ ఫాంతో ఆ మధ్య విమర్శలు ఎదుర్కొన్న ధోని ఆసియాకప్‌లో రాణించిన సంగతి తెలిసిందే. 'కెరీర్ ఆసాంతం అత్యుత్తమ ఫామ్‌లో ఉండటం ఏ ఆటగాడికీ సాధ్యం కాదు. ఎందుకంటే అతడు యంత్రం కాదు. బంతి ధోని బ్యాటుకు తగిలినప్పుడు వచ్చిన శబ్దం నాకు భిన్నంగా వినిపించింది. బ్యాట్స్‌మన్ భిన్నమైన దృక్పథంతో ఉన్నాడనే చెప్పే శబ్దం అది' అని సచిన్ అన్నాడు.
'ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోవడమే ధోనీకున్న పెద్ద బలం. అందుకే అతడు మంచి కెప్టెనయ్యాడు. చాలా పరిణతి సాధించాడు. ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నా దాన్ని అతడు బయటికి కనపడనివ్వడు. అది మంచి విషయం' అని ఓ ఛానెల్‌తో సచిన్ అన్నాడు.

ఇక యువరాజ్ ఫుట్‌వర్క్ చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా ధోనీని అభిరవర్ణిస్తూ అతనితో జతగా యువరాజ్ కూడా మంచి టచ్‌లో ఉండటంతో భారత్‌కు ఈ టోర్నీలో తిరుగుండదని తేల్చాడు. తాజాగా టీమిండియాలో చేరిన యువ ఆటగాడు జస్ప్రిత్ బూమ్రా ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు.
ఏప్రిల్ 3, 2016 న ఈడెన్‌లో జరగబోయే సంబరాలు 2011, ఏప్రిల్ 20వ తేదీన జరిగిన సంబరాలకు భిన్నంగా ఉండబోవని ఆశిస్తున్నాని చెప్పకనే మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిలుస్తుందని జోస్యం చెప్పాడు.
భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరొచ్చని సచిన్ అన్నాడు. బ్రెండన్ మెక్‌కలమ్ లేకపోవడం న్యూజిలాండ్‌కు పెద్ద లోటు అని చెప్పాడు.