ధర్మశాల: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా మార్చి 19న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ధర్మశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇద్దలు సభ్యులతో కూడిన పాకిస్థాన్ బృందం సోమవారం ఉదయం భారత్‌కు చేరుకుంది.
భారత అధికారులతో కలిసి ధర్మశాల స్టేడియాన్ని పరిశీలించనున్న ఆ బృందం అనంతరం హిమాచల్ ప్రదేశ్ సీఎం, పోలీసు అధికారులతో చర్చించనుంది. భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ బృందం అనుమతిస్తేనే, పాక్ జట్టు భారత్ పర్యటనకు వస్తుంది.
ఈ క్రమంలో ఈ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పఠాన్ కోట్ దాడి, ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చోటుచేసుకున్న మార్పుల నేఫథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటిస్తుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పాక్ ప్రభుత్వ నిర్ణయంపై పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ భారత్ ప్రభుత్వం పాక్ క్రికెట్ జట్టు పర్యటన, వసతులు విషయంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే అభిమానులకు వీసా సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు.
వరల్డ్ టీ20లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్ ఆడుతుందని భారత ప్రభుత్వం ఓ బహిరంగంగా ప్రకటన చేయాలని కోరింది. ప్రకటన రాకపోతే చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ మార్చి 8న ఆరంభమై, ఏప్రిల్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. మరోవైపు ధర్మశాలలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆడరాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా ప్రకటన చేశారు. అతిథి మర్యాదలకు పూర్తిగా వ్యతిరేకం. విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మశాలలో పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందని నేను భావించడం లేదు' అని ఇమ్రాన్ పేర్కొన్నాడు.