ముంబై: ట్వంటీ20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మొహాలీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ గాయపడటంతో వెస్టిండీస్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం మనీష్ పాండేకు పిలుపు వచ్చింది. యువరాజ్ కోలుకుని ఆడే పరిస్థితి లేకపోతే మనీష్ పాండేను ఆడిస్తారు.
ప్రస్తుతం బ్యాక్‌అప్ ప్లేయర్‌గా వెళ్తున్న పాండే కర్ణాటక బ్యాట్స్‌మన్. ఆస్ట్రేలియా పర్యనటలో సెంచరీతో సత్తా చాటాడు. యువరాజ్ స్థానంలో పాండే ఆడటం భారత జట్టుకు కలిసి వస్తుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.

తుది జట్టులోకి అజింక్యా రహనేను తీసుకుంటారా, మనీష్ పాండేతో ఆడిస్తారా అనేది తేలాల్సి ఉంది. అజింక్యా రహనే ఇప్పటి వరకు బెంచీకే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో యువీ మోకాలికి గాయమైంది. దానికి స్కానింగ్ చేయించినట్లు తెలుస్తోంది.
పరిస్థితి డిమాండ్ చేస్తే తుది జట్టులో మార్పులు చేయడానికి అవకాశం ఉందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. ఆదివారం ఆస్ట్రేలియాపై విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. వెస్టిండీస్‌తో సెమీ ఫైనల్ మ్యాచు ఈ నెల 31వ తేదీ గురువారం జరగనున్న విషయం తెలిసిందే.