ముంబై: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భారత జట్టు సెమీ ఫైనల్‌కు వచ్చినందుకు విరాట్ కోహ్లీకి, బంగ్లాదేశ్‌కు కృతజ్ఞతలు చెప్పాలని కపిల్ దేవ్ అన్నాడు. భారత జట్టు ఇక్కడి దాకా వచ్చినందుకు ఓ రకంగా బంగ్లాదే, కోహ్లీలే కారణమని చెప్పాడు.
బంగ్లాదేశ్ ఓడిన మ్యాచ్‌ను పదింట తొమ్మిది జట్లు గెలిచేవని, మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో భారత్ అద్భుతంగా ఆడి విజయాన్ని బంగ్లా నుంచి లాగేసుకుందన్నాడు. ఓటమి కోరల వరకు వచ్చినా భారత్ స్థిరంగా ఆడిన తీరు అభినందనీయమన్నాడు. మనం ఓడితే ఆత్మవిశ్వాసం దెబ్బతినేదన్నాడు.
ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం కేవలం అత్యుత్తమ బౌలర్‌తో మాత్రమే పని కాదని ధోనీ ఆచరించి చూపించాడని కితాబిచ్చాడు. చేతన్ శర్మను హార్ధిక్ పాండ్యా గుర్తు చేశాడన్నాడు. విమర్శలను పట్టించుకోకుండా మ్యాచ్ గురించి మాత్రమే ధోనీ ఆలోచిస్తాడని చెప్పాడు.

2007లో జోగిందర్ శర్మ చేతికి బంతిని అప్పగించి ఇటువంటి వ్యూహాన్నే అమలు చేశాడని, ఈ వ్యూహంతో విజయం అనేది అదృష్టం అయితే కావచ్చు ఏమోగానీ ఇదో సాహసోపేతమైన అడుగు అని కితాబిచ్చాడు. వాంఖేడేలో ఆట కోసం అందరూ ఎదురు చూస్తున్నారన్నాడు.
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారన్నాడు. గేల్ చెలరేగితే ఎవరైనా చూస్తుండటం తప్ప చేసేది ఏం లేదన్నాడు. సచిన్ టెండుల్కర్‌లా.. విరాట్ కోహ్లీ కూడా ఒత్తిడిని అద్భుతంగా ఎదుర్కొంటాడని చెప్పాడు. మా తరం క్రికెటర్ల కంటే ఇప్పటి వారు వెయ్యి రెట్లు ఉత్తమమని చెప్పాడు. కోహ్లీ.. సచిన్, లారా, వివ్ రిచర్డ్స్ కంటే ఉత్తమమని కపిల్ గతంలో చెప్పాడు.