నాగపూర్: భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా మంగళవారం న్యూజిలాండుతో టీమిండియా తలపడుతోంది. న్యూజిలాండుతో పోరుతో ధోనీ రికార్డ్ సృష్టించాడు.
ఆరు ప్రపంచ ట్వంటీ 20 ఎడిషన్లలోను కెప్టెన్‌గా వ్యవహరించినది ధోనీ ఒక్కడే. 2007లో సౌతాఫ్రికాలో జరిగిన ప్రపంచ ట్వంటీ 20 కప్‌ను ధోనీ సేన కైవసం చేసుకుంది. ఇదే ప్రారంభ ఎడిషన్. అప్పటి నుంచి భారత జట్టుకు ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
2006 డిసెంబర్ నెలలో సౌతాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్‌లో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌తో ధోనీ ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ధోనీ 63 ట్వంటీ 20 మ్యాచులు ఆడాడు. ధోనీ తొలిసారి 2007లో కెప్టెన్ అయ్యాడు.
ఆ తర్వాత 2009, 2010, 2012, 2014లలో జరిగిన ప్రపంచ కప్ ట్వంటీ 20 టోర్నమెంటులలోను భారత జట్టును నడిపించాడు. ఇప్పుడు ఆరో ఎడిషన్.

ఇప్పటి వరకు 28 ప్రపంచ కప్ ట్వంటీ 20 మ్యాచులకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 18 గెలుపు, 9 ఓటములు ఉన్నాయి. ఒక గేమ్ రద్దయింది. వరల్డ్ కప్ ట్వంటీ 20లో.. ఎక్కువ మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించింది ధోనీయే.
గత టోర్నమెంటులో బంగ్లాదేశ్‌లో.. శ్రీలంక చేతిలో ధోనీసేన ఓడిపోయింది. ఈ ఏడాది ధోనీ సేననే ఫేవరేట్. ఈసారి కూడా ధోనీసేన టైటిల్ గెలిస్తే... మరో రికార్డ్ అవుతుంది. వరల్డ్ కప్ ట్వంటీ 20ని రెండుసార్లు గెలిపించిన కెప్టెన్‌గా ధోనీ నిలుస్తాడు. 2007లో ధోనీ సేన గెలిచింది.
ఆ తర్వాత జరిగిన నాలుగు ఏడిషన్లలో వేర్వేరు జట్లు టైటిల్ గెలుచుకున్నాయి. అంతేకాదు, స్వదేశంలో ఏ జట్టు కూడా ప్రపంచ కప్ ట్వంటీ 20 టోర్నీ గెలవలేదు. ఇప్పుడు ధోనీ గెలిపిస్తే అతనికి ఇది ఇంకో రికార్డ్ అవుతుంది. ఇప్పటికే రికార్డులు సృష్టించిన ధోనీ.. కప్ గెలిస్తే మరిన్ని రికార్డులు అతని సొంతం అవుతాయి. ధోనీకి ఇదే చివరి ట్వంటీ 20 ప్రపంచకప్ కావొచ్చు.