ముంబై: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచులో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఇంగ్లాండు బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గేల్ తనదైన దూకుడు ప్రదర్శించారు. ఏకంగా 11 సిక్సర్లు బాది వెస్టిండీస్‌కు ఇంగ్లాండుపై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి పెట్టాడు.
టీ-20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, ఓవరాల్‌గా మూడో వేగవంతమైన శతకం గేల్ ద్వారా సార్థకమైంది. క్రిస్ గేల్ (48 బంతు ల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్లతో 100 నాటౌట్) మెరుపు వేగంతో సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని విండీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

రెండో బంతికే ఓపెనర్ చార్లెస్ (0) వికెట్ కోల్పోయినా గేల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయం అందించాడు. మార్లోన్ శామ్యూల్స్ (27 బంతుల్లో 8 ఫోర్లతో 37)తో రెండో వికెట్‌కు 55 పరుగులు, ఆండ్రీ రస్సెల్ (16 నాటౌట్)తో ఐదో వికెట్‌కు అజేయంగా 70 రన్స్ జోడించాడు.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 182 పరుగులు చేసింది. రూట్ (48), బట్లర్ (30), కెప్టెన్ మోర్గాన్ (27 నాటౌట్) సత్తా చాటారు. గేల్‌కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో విండీస్ రెండు పాయింట్లు దక్కించుకుంది.

ఈ మ్యాచ్‌లో గేల్ బ్యాట్ ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. 47 బంతుల్లోనే శతకం సాధించిన క్రిస్ టీ-20 వరల్డ్‌క్‌పలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో 2007లో తన పేరిటే ఉన్న రికార్డు (50 బంతుల్లో)ను తిరగరాశాడు. ఈ ఫార్మాట్‌లో ఓవరాల్‌గా ఇది మూడో వేగవంతమైన సెంచరీ.

రిచర్డ్ లెవీ (45 బంతుల్లో), డుప్లెసిస్ (46) గేల్‌కంటే ముందున్నారు. ఇక 11 సిక్సర్లతో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో ప్లేయర్‌గా గేల్ నిలిచాడు. మొత్తంగా 98 సిక్సర్లతో పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మన్‌గా బ్రెండన్ మెకల్లమ్ (91)ను పక్కకు నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు.